ఇన్‌స్పైర్‌లో విజయనగరం విద్యార్థినుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

ఇన్‌స్పైర్‌లో విజయనగరం విద్యార్థినుల ప్రతిభ

Oct 15 2026 11:41 AM | Updated on Oct 15 2026 11:41 AM

ఇన్‌స్పైర్‌లో విజయనగరం విద్యార్థినుల ప్రతిభ

● చిన్నారి ఆలోచనలు.. జాతీయ స్థాయి ఆవిష్కరణలు!

● ఒకరిది ఆరోగ్య భద్రత..మరొకరిది రైతుకు ఊరట

విజయనగరం అర్బన్‌: చిన్న వయసులోనే వినూత్నంగా ఆలోచించారు.. నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు చూపించారు. తమ ఆలోచనలకు ప్రాజెక్టుల రూపమిచ్చి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు విజయనగరం జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్ధినులు. న్యూఢిల్లీలో నిర్వహించిన 12వ జాతీయ స్థాయి ఇన్‌స్పైర్‌ మనక్‌ నేషనల్‌ ఎగ్జిబిషన్‌ అండ్‌ ప్రాజెక్ట్‌ కాంపిటేషన్స్‌కు వీరు రూపొందించిన రెండు ప్రాజెక్టులు ఎంపిక కావడం విశేషం. ఒక ప్రాజెక్టు నిద్రలోనూ ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించే విధంగా ఉండగా.. మరొకటి తక్కువ ఖర్చుతో ధాన్యాన్ని శుభ్రం చేసేందుకు ఉపయోగపడేలా రూపొందించారు.

నిద్రలోనూ ఆరోగ్యంపై నిఘా..

మలిచర్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్న ఎ.సాయివైష్టవి ‘రిమోట్‌ స్లీప్‌ మానిటరింగ్‌ అండ్‌ మెడికల్‌ అలారం సిస్టమ్‌’ను గైడ్‌ టీచర్‌ సైన్స్‌ ఉపాధ్యాయుడు సుబ్రహ్మణ్యం సహకారంతో రూపొందించారు. నిద్రిస్తున్న సమయంలో వ్యక్తి ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షిస్తూ, అవసరమైన సందర్భాల్లో వైద్యపరమైన హెచ్చరికలు అందించాలన్నది ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. నిద్రలో ఉన్నవారి ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు, సంరక్షకులు అప్రమత్తంగా ఉండేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించవ్చనే ఆలోచన ఇందులో కనిపిస్తుంది. ఆరో తరగతిలోనే ఆరోగ్య భద్రతపై దృష్టి సారించి ప్రాజెక్టును రూపొందించడం సాయి వైష్టవి సృజనాత్మకతకు నిదర్శనం.

రైతుకు తక్కువ ఖర్చుతో పరిష్కారం..

కొండవెలగాడ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఎల్‌.లిడియో గ్రేస్‌ వ్యవసాయానికి ఉపయోగపడే ప్రాజెక్టును గైడ్‌ టీచర్‌ సైన్స్‌ ఉపాధ్యాయుడు కృష్ణమోహన్‌ సహకారంతో రూపొందించారు. ‘లో కాస్ట్‌ విన్నోయింగ్‌ యూనిట్‌’ పేరుతో రూపొందించిన ఈ నమూనా ద్వారా ధాన్యం నుంచి పొట్టు, తేలికపాటి వ్యర్ధాలను వేరు చేయవచ్చు. సాధారణంగా ధాన్యాన్ని తూర్పారబట్టే ప్రక్రియలో శ్రమ, సమయం అవసరమవుతాయి. ఈ పనిని తక్కువ ఖర్చుతో సులభతరం చేయాలన్న ఆలోచనతో లిడియో గ్రేస్‌ తన ప్రాజెక్టును రూపొందించారు. రైతులకు ఉపయోగపడే పరిష్కారాన్ని ఆవిష్కరించాలన్న తపన ఈ నమూనాలో ప్రతిబింబిస్తోంది.

సృజనాత్మకతకు జాతీయ గుర్తింపు

విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం, పరిశోధనా ఆసక్తి, నూతన ఆవిష్కరణల పట్ల అభిరుచిని పెంపొందించడమే ఇన్‌స్పైర్‌ మనక్‌ కార్యక్రమ లక్ష్యం. ఈ వేదిక ద్వారా విద్యార్థులు తమ చుట్టూ ఉన్న సమస్యలను గుర్తించి, వాటికి పరిష్కారాలను అన్వేషించే అవకాశం లభిస్తుంది. ఈ క్రమంలో జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్ధినులు రూపొందించిన ప్రాజెక్టులు జాతీయ స్థాయికి ఎంపిక కావడంతో విద్యారంగంలో జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. విద్యార్థినుల ప్రతిభను డీఈఓ యూ.మాణిక్యం నాయుడు, జిల్లా సైన్స్‌ అధికారి టి.రాజేష్‌ అభినందించారు. వారికి మార్గదర్శకత్వం వహించిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులను ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని వినూత్న ఆవిష్కరణలతో జిల్లాకు మంది పేరుతేవాలంటూ ప్రోత్సహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement