మక్కువ: ఉత్తరాంద్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారు బుధవారం లలితా త్రిపురసుందరిదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. శంబర గ్రామంలోని చదురుగుడిలో కొలువైన పోలమాంబ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో లలితా హోమం నిర్వహించారు. పూజలలో పాల్గొన్న భక్తులకు అమ్మవారి ప్రసాదాన్ని దేవదాయ శాఖ ఆధ్వర్యంలో అందించారు. కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ నైదాన తిరుపతి, ఆలయ ఈవో వి వి.సూర్యనారాయణ, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.
జిల్లా అటవీ అధికారిగా బబితా కుమారి బాధ్యతల స్వీకరణ
విజయనగరం గంటస్తంభం: జిల్లా అటవీ శాఖ అధికారిగా బబితా కుమారి (ఐఎఫ్ఎస్) బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న శ్యామ్ సుందరం నుంచి ఆమె బాధ్యతలు తీసుకున్నారు. జిల్లాలో అటవీ సంపద పరిరక్షణతో పాటు నగరవనాలు, ఎకో టూరిజం పార్కుల అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.
విజయవాడలీగల్: బ్లేడుతో గాయపరిచిన కేసులో ముద్దాయికి ఏడాది జైలుశిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ 13వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎం.సుధ బుధవారం తీర్పునిచ్చారు. విజయనగరం జిల్లా గంట్యాడ గ్రామానికి చెందిన వ్యక్తి విజయవాడ గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దిబోట్ల వారి వీధిలోని ఓ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. 2022 ఏప్రిల్ మూడో తేదీ సాయంత్రం ఐస్క్రీమ్ బండి వద్దకు వెళ్లాడు. అదే సమయంలో విజయవాడకు చెందిన కందుల విఘ్నేశ్వరరావు అలియాస్ విఘ్నేష్ అక్కడికి వచ్చి గంట్యాడకు చెందిన వ్యక్తిని డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోవడంతో విఘ్నేష్ తన వద్ద ఉన్న బ్లేడ్తో అతని మెడ, చేతి మీద గాయపరిచి పారిపోయాడు. ఈ ఘటనపై గవర్నర్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు విఘ్నేష్ను అదే నెల నాలుగో తేదీన అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. ప్రాసిక్యూషన్ తరఫున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గీతా పూర్ణిమ, ప్రస్తుత ఇన్స్పెక్టర్ బాలమురళీకృష్ణ, సీఎంఎస్ ఇన్స్పెక్టర్ వాసవి, సీఎంఎస్ సిబ్బంది పర్యవేక్షణలో ఆరుగురు సాక్షులను విచారించారు. నిందితుడిపై నేరం రుజువుకావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పునిచ్చారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
● మరొకరికి తీవ్ర గాయాలు
గంట్యాడ: మండల పరిధిలోని కొర్లాం గ్రామ సమీపంలో గ్రీన్ఫీల్డ్ హైవే–516 పై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..కె.కోటపాడు మండలం వారాడ సంతపాలెం గ్రామానికి చెందిన జాగరపు దేవుడు(55), చుక్క నాగమనాయుడు ఈనెల 13న బంధువుల ఇంట శుభకార్యం నిమిత్తం సాలూరు వెళ్లారు. తిరిగి ద్విచక్ర వాహనంపై వస్తుండగా కొర్లాం సమీపంలో వాహనం అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో బైక్ వెనుక కూర్చున్న జాగరపు దేవుడు తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ నడుపుతున్న నాగమనాయుడు తీవ్రంగా గాయపడడంతో మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖపట్నం ఆస్పత్రికి తరలించారు. ఈ సమాచారం అందుకున్న గంట్యాడ ఎస్సై కె.లక్ష్మణరావు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


