విజయనగరం అర్బన్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్జీఎఫ్ఐ) ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో ఇటీవల నిర్వహించిన క్రీడా ఎంపికల్లో గురజాడ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపారు. క్రికెట్ విభాగంలో డి.భార్గవ్, అథ్లెటిక్స్‌లో 110 మీటర్ల హార్డిల్స్ ఈవెంట్లో ఎస్.పార్థు రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. పదోతరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ డాక్టర్ ఎంవీఆర్ కృష్ణాజీ, కరస్పాండెంట్ ఎం.స్వరూప, హెచ్ఎం పూడిశేఖర్, వ్యాయామ ఉపాధ్యాయుడు పి.సన్యాసినాయుడు అభినందించారు.
జిల్లా అదనపు ఎస్పీగా పద్మలత
విజయనగరం టౌన్: జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్)గా ఎ.పద్మలతను నియమిస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజీత్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆమె ఇప్పటివరకూ సీఐడీ విభాగంలో అదనపు ఎస్పీగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఇక్కడ అదనపు ఎస్పీ(అడ్మిన్)గా పనిచేసిన సౌమ్యలతను విజిలెన్స్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
పణుకువలస వద్ద డైవర్షన్ రోడ్డు
తెర్లాం: రాజాం–రామభద్రపురం ఆర్అండ్బీ రోడ్డులో తెర్లాం మండలంలోని పణుకువలస కూడలి వద్ద డైవర్షన్ రోడ్డు నిర్మాణానికి ఆర్అండ్బీ శాఖ రూ.67లక్షలు మంజూరు చేసింది. గత నెలలో పణుకువలస కూడలి వద్ద ఉన్న వంతెన కూలిపోయిన విషయం తెలిసిందే. వాహన రాకపోకలు నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వంతెన వద్ద తాత్కాలికంగా డైవర్షన్ రోడ్డు నిర్మించేందుకు రూ.75 లక్షలతో ఆర్అండ్బీ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించగా రూ.67లక్షలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
భోజనం బాగులేదు
● ఆరోగ్యశ్రీ రోగుల ఆవేదన
● ఐవీఆర్ఎస్ కాల్స్‌కు రోగుల సమాధానం
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ రోగులకు అందించే భోజనం బాగులేదంటూ అధికమంది రోగులు ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్‌కు సమాధానం చెప్పారు. అలాగే, ప్రభుత్వాస్పత్రులతో పాటు ప్రైవేటు ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్వైద్య సేవ) ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని, రోగులకు కేటాయించే వార్డులు అపరిశుభ్రతకు నిలయాలుగా మారాయని వాపోయారు. కొన్నిచోట్ల మందులు, ఆపరేషన్ ఖర్చుల పేరుతో రోగుల నుంచి అదనపు వసూళ్లు (కో పేమెంట్) చేస్తున్నట్టు తెలియజేశారు. మెనూ ప్రకా రం భోజనం అందేలా చూడాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. ఇదే విషయంపై ఆరోగ్యశ్రీ కో ఆర్డినేట్ కె.సాయిరాం స్పందిస్తూ ఐవీఆర్ఎస్ కాల్స్ వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. నెట్వర్క్ ఆస్పత్రుల్లో భోజనం, పారిశుధ్యం మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, అదనపు వసూళ్లకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని చెప్పారు.
సెంచూరియన్‌లో బిగ్ ఫెస్ట్
నెల్లిమర్ల రూరల్: మండలంలోని టెక్కలి గ్రామంలో ఉన్న సెంచూరియన్ విశ్వ విద్యాలయంలో స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో మంగళవారం బిగ్ ఫెస్ట్–2026 కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో వీసీ ప్రొఫెసర్ ప్రశాంత్ కుమార్ మహంతి మాట్లాడుతూ మేనేజ్మెంట్ విద్యార్థులకు వ్యాపార ఆలోచనలతో పాటు నైపుణ్యాలు ఎంతో అవసరమన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఐఐఎం విశాఖ ప్రొఫెసర్ పంకజ్ విశకర్మ వ్యాపారాల్లో అనుసరించాల్సిన మార్కెటింగ్ వ్యూహాలను వివరించారు. కార్యక్రమంలో బోర్డు సభ్యుడు నరేంద్ర, సిబ్బంది పల్లవి, రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.


