నిబంధనలు తూచ్‌... | - | Sakshi
Sakshi News home page

నిబంధనలు తూచ్‌...

Oct 12 2026 8:28 AM | Updated on Oct 12 2026 8:28 AM

నిబంధనలు తూచ్‌...

డ్రైవింగ్‌ స్కూళ్ల నిర్వాహకుల ఇష్టారాజ్యం

చాలా వరకు సౌకర్యాల్లేని స్కూళ్లే..

20 రోజుల శిక్షణకు రూ.వేలల్లో ఫీజులు

నిబంధనలు పాటించాల్సిందే..

విజయనగరం ఫోర్ట్‌:

డ్రైవింగ్‌ స్కూళ్ల నిర్వాహకులు నిబంధనలు పాటించడం లేదనే విమర్శలు పెద్దెత్తున వినిపిస్తున్నాయి. డ్రైవింగ్‌ స్కూల్‌ నిర్వాహణకు అవసరమై న సౌకర్యాలు లేకుండానే నిర్వహించేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నిబంధనలు పాటించకుండా స్కూళ్లు నిర్వహించడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారనే.. ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొంతమంది నిర్వాహ కులు సాధారణ కారులను సైతం డ్రైవింగ్‌ నేర్పించడానికి వినియోగిస్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమైనప్పటకీ రవాణ శాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

నిబంధనలు ఇలా..

డ్రైవింగ్‌ చేసేటప్పుడు పాటించాల్సిన నిబంధనలు గురించే చెప్పడానికి ఒక తరగతి గది ఉండాలి. ఒక మెకానిక్‌ రూమ్‌ కూడా ఉండాలి. డ్రైవింగ్‌ నేర్పే వ్యక్తికి ఐదేళ్లు నిండిన డ్రైవింగ్‌ లైసెన్సు ఉండాలి. ఐటీఐ డీజిల్‌ మెకానిక్‌ చదివి ఉండాలి. మో డల్‌ వెహికల్‌ (ఫిట్‌నెస్‌ కల్గిన) వాహనం ఉండాలి. అదే విధంగా డ్రైవింగ్‌ స్కూల్‌ నిర్వహించే భవనానికి సంబంధించిన లీజు అగ్రిమెంట్‌ ఉండాలి.

రూ.వేలల్లో ఫీజులు..

కారు డ్రైవింగ్‌ నేర్పించే వారికి 20 రోజుల పాటు శిక్షణ ఇస్తారు. రోజుకి 10 కిలోమీటర్లు చొప్పన 200 కిలోమీటర్లు డ్రైవింగ్‌ నేర్పిస్తారు. ఇందుకుగాను డ్రైవింగ్‌ స్కూల్‌ నిర్వాహకులు అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. గతంలో రూ.1500 నుంచి రూ.2 వేలు ఉండేది. ఇప్పుడు ఈ ఫీజును ఏకంగా రెట్టింపు చేసేశారు. రూ.4 వేలు నుంచి రూ.4500 వరకు ఫీజు వసూలు చేస్తున్నారు.

జిల్లాలో 30 పైబడి స్కూళ్లు

జిల్లాలో 30 నుంచి 40 వరకు డ్రైవింగ్‌ స్కూళ్లు ఉన్నాయి. కొందరు రవాణ శాఖ వద్ద అనుమతి లేకుండానే డ్రైవింగ్‌ స్కూల్‌ నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. డ్రైవింగ్‌ స్కూల్‌ అనే బోర్డు లేకుండా కారుల్లో కూడా డ్రైవింగ్‌ కొంతమంది నేర్పించేస్తున్నారు. ఇటువంటి వారు నెలవారీ మామూళ్లు రవాణ శాఖ అధికారులకు ముట్టజెబుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో సంబంధిత అధికారులు ఇటువంటి స్కూళ్ల వైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు ఉన్నాయి.

నిబంధనలు ప్రకారం డ్రైవింగ్‌ స్కూళ్లు నిర్వహించాలి. ఇటీవల కొంతమంది డ్రైవింగ్‌ స్కూళ్ల నిర్వాహకులకు నోటీసులు కూడా ఇచ్చాం. నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకుంటాం.

– మణికుమార్‌, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement