అటకెక్కిన ఆర్థోసేవలు | - | Sakshi
Sakshi News home page

అటకెక్కిన ఆర్థోసేవలు

Oct 10 2026 12:34 AM | Updated on Oct 10 2026 12:34 AM

అటకెక్కిన ఆర్థోసేవలు

రాజాం: పేదలకు కార్పోరేట్‌వైద్యం అందించాలనే లక్ష్యంతో గత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంతో కృషిచేసింది. పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ అమలుతో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇంటిగ్రేటెడ్‌ ల్యాబ్‌లు, ఆపరేషన్‌ థియేటర్లు, ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసింది. అరకొరగా ఉన్న వైద్యుల పోస్టులు భర్తీచేసింది. ప్రతి మూడునెలలకు ఒక దఫా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశాలను పక్కాచేసింది. అందులో ప్రస్తావించే సమస్యలను ఆరు నెలల వ్యవధిలో పరిష్కరించేది. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఆస్పత్రి అభివృద్ధి కమిటీల సమావేశాలు తూతూ మంత్రంగానే జరుగుతున్నాయి. అంతేకాకుండా గత ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఆపరేషన్‌ థియేటర్లు, ల్యాబ్‌లు సేవలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. వైద్యుల్లో అలసత్వం, పాలకమండలి పట్టించుకోకపోవడం, అభివృద్ధి కమిటీల అడ్రస్‌లేకపోవడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు వైద్యం అందని ద్రాక్షగా మారుతోంది.

ఓపీలు ఎక్కువే..ఆపరేషన్లు తక్కువ

రాజాం ఏరియా ఆస్పత్రిలో ఆర్థోపెడిక్‌ విభాగానికి డిమాండ్‌ ఉంది. ప్రతిరోజూ 10 నుంచి 15మందికి వరకూ రోగులు ఆర్థో విభాగానికి వస్తున్నారు. వారిలో ఎముకలు విరిగినవారు, మోకాళ్లు, నడుము, కండరాల సమస్యలతో బాధపడుతున్నవారంతా వస్తున్నారు. ప్రమాదాల బారిన పడి గాయాలైనవారు సైతం ఇక్కడి ఆస్పత్రినే తొలుత ఆశ్రయిస్తున్నారు. వారందరికీ ఓపీ వైద్య పరీక్షల అనంతరం ఆపరేషన్ల నిమిత్తం ఇక్కడి వైద్యులు ప్రైవేట్‌ ఆస్పత్రులను సూచిస్తున్నారు. దగ్గరుండి ఫలానా ఆస్పత్రికి వెళ్తే ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని, రూ.10వేల నుంచి రూ.50 వేలు అదనంగా చెల్లిస్తే మంచి వైద్యం అందుతుందని, ఇక్కడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరితే ఫలితమేమీ ఉండదని వైద్యులే నేరుగా చెబుతున్నారు. మేం అంత డబ్బులు పెట్టుకోలేమని చెప్పేవారిని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఆస్పత్రులకు రిఫర్‌చేసి పంపించేస్తున్నారు. చిన్నచిన్న సమస్యలకు ఇక్కడే కట్లు కట్టి మమ అనిపిస్తున్నారు. వారికి కూడా ఆస్పత్రిలో ల్యాబ్‌, ఎక్స్‌రే విభాగాలు ఉన్నా పైవేట్‌ ల్యాబ్‌ సెంటర్లకు పంపించి రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. అక్కడి నుంచి ప్రైవేట్‌ ఆస్పత్రులకు తరలింపు చేసి, లోపాయికారీ ఒప్పందాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నెలకు కనీసం 30 ఆపరేషన్లు కూడా ఇక్కడ నమోదుకాకపోవడం ఒక ఎత్తైతే, కాస్తో కూస్తో ఆర్థో వైద్యసేవలు కట్టుకట్టడం వంటివి కావడం మరో ఎత్తు.

ముగ్గురు ఉన్నా..ఫలితం సున్నా..

రాజాం ఏరియా ఆస్పత్రి పరిధిలో 5 లక్షలకు పైగా జనాభా ఉంది. ఇందులో సాధారణ, మధ్యతరగతి కుటుంబాలు అధికంగా ఉన్నాయి. ఇక్కడి ఆస్పత్రిలో అన్నిరకాల వైద్యసేవలు, వైద్య పరీక్షలు అందుబాటులో ఉన్నాయని ప్రచారం చేసుకుంటున్న అధికారులు ఆర్థోవిభాగంలో పేదలకు సకాలంలో సేవలు అందించ లేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక రెగ్యులర్‌ ఆర్థో వైద్యుడితో పాటు ఇద్దరు పీజీ వైద్యులు ఉన్నారు. ముగ్గురున్నప్పటికీ ఏ ఒక్కరూ సకాలంలో స్పందిండంలేదని, ఆస్పత్రిలో ఓపీ తీసుకుని వైద్యం నిమిత్తం చేరితే ఒకటి రెండు రోజులు దాటితేకానీ వైద్యం చేయడంలేదని, ఆపరేషన్లు చేయాల్సిన వైద్యానికి కట్టుకట్టి విడిచిపెడుతున్నారని రోగులు వాపోతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఇక్కడి ఆర్థోసేవలపై దృష్టిసారించాలని, ఆపరేషన్లు వంటివి చేయాలని కోరుతున్నారు. నిర్లక్ష్యం వహిస్తున్న వైద్యులపై చర్యలకు డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ సమస్యపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ దామోదర్‌ ప్రధాన్‌ వద్ద సాక్షి ప్రస్తావించగా రాజాం ఏరియా ఆస్పత్రిలో ఆర్థో సేవలు బాగానే జరుగుతున్నాయని, చిన్నచిన్నలోటుపాట్లు ఉంటాయని వెల్లడించారు. ముగ్గురు వైద్యులతో సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఇక్కడ వైద్యంకుదరకపోతే ఇతర ఆస్పత్రులకు పంపిస్తున్నట్లు ఉన్నారని, దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు.

రోజు గడిచినా పట్టించుకోలేదు

మేం ఆస్పత్రిలో చేరి ఒకరోజు అవుతోంది. ఇంట్లో పనిచేస్తుండగా జారడంతో చేయి మలపడింది. విరిగినట్లు అనిపిస్తోంది. ఇక్కడికి వచ్చి ఓపీ తీసుకుంటే వార్డులో ఉండమన్నారు. ఇంతవరకూ ఎవరూ రాలేదు..పట్టించుకోలేదు. ఎక్స్‌రే, స్కానింగ్‌ వంటివి చేయలేదు. బ్లడ్‌ టెస్టు చేయాలన్నారు..అది కూడా చేయలేదు. ఇక్కడ వైద్యం చేస్తారో..చేయరో తెలియని పరిస్థితి కనిపిస్తోంది.

జి.పార్వతి, రాజాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement