విజయనగరం టౌన్: వివిధ క్రిమినల్ కేసుల్లో నిందితులను అరెస్టు చేసే సమయంలో వ్యక్తిని పూర్తిస్థాయిలో విచారణ చేసి, చిరునామా, ఆధార్, పాన్, బ్యాంక్, ఫోన్ నంబర్లు, కుటుంబ సభ్యుల వివరాలను, ఫొటోలు, వారి ఫోన్ నంబర్లు, పనిచేస్తున్న కార్యాలయం చిరునామా వంటి పూర్తి వివరాలను సేకరించి స్టేషన్ రికార్డుల్లో భద్రపర్చాలని పోలీస్ అధికారులను ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశించారు. ఈ మేరకు జిల్లాలో వివిధ స్టేషన్‌లలో పనిచేస్తున్న పోలీసు అధికారులతో ఎస్పీ ఏఆర్.దామోదర్ శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో మాసాంతర నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు రానున్న నేపథ్యంలో పెండింగులో ఉన్న నాన్ బెయిల్‌బుల్ వారెంట్లను ఎగ్జిక్యూట్ చేయాలని, ఎగ్జిక్యూట్ చేయని వారంట్లకు సహేతుకరమైన కారణాలను తెలపాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో సమస్యలు సృష్టించే వ్యక్తులను పార్టీలకతీతంగా గుర్తించి, వారిపై బైండోవర్ కేసులు నమోదుచేయాలని, మండల ఎగ్జిక్యూటివ్ ఆఫీసుల్లో , సెక్యురిటీగా బాండ్‌లను ఎగ్జిక్యూట్ చేయాలని సూచించారు. కేసుల దర్యాప్తును పూర్తిగా పరిశీలించిన తర్వాతనే న్యాయస్ధానాల్లో అభియోగపత్రాలను దాఖలు చేయాలన్నారు.
సీసీ కెమెరాల పట్ల అవగాహన కల్పించాలి
నేరాల నియంత్రణకు క్రైమ్ ఫ్రోన్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటుచేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటుచేయడం పట్ల షాపు యజమానులు, గృహ సముదాయాల యజమానులకు అవగాహన కల్పించాలన్నారు. స్థానిక సంస్ధల ఎన్నికలను సజావుగా, శాంతియుతంగా నిర్వహించేందుకు పల్లెనిద్ర, గ్రామసభలను చేపట్టాలని, ఎన్నికల నిబంధనలు, ప్రవర్తనా నియమావళి పట్ల అవగాహన కల్పించాలన్నారు. మున్సిపల్ ఎన్నికలు, పైడితల్లి అమ్మవారి పండగలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయవంతంగా పూర్తిచేసేందుకు అధికారులు సిద్ధం కావాలన్నారు. రహదారి ప్రమాదాల నియంత్రణకు ఏర్పాటుచేస్తున్న స్టాపర్లు, రాత్రి సమయాల్లో వాహనదారులకు కనిపించే విధంగా వాటిపై రేడియం స్టిక్కర్లను ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు. మిస్సింగ్ కేసుల్లో అదృశ్యమైన వ్యక్తులను గుర్తించాలని, వారి ఫోటోలను 360 డిగ్రీస్ యాప్‌లో అప్‌లోడ్ చేసి, విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వివిధ పోలీసుస్టేషన్‌లో నమోదై , దర్యాప్తులో ఉన్న లాంగ్ పెండింగు కేసులను, ఎస్‌సి, ఎస్‌టి, పోక్సో, ఎన్‌డీపీఎస్, మిస్సింగ్, చోరీ కేసులను, మహిళలపై జరుగుతున్న దాడులు కేసులను , గ్రేవ్, నాన్‌గ్రేవ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసులను ఎస్పీ సమీక్షించి, ఆయా కేసుల దర్యాప్తు పెండింగులో ఉండడానికి గల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకుని, దర్తాప్తు పూర్తి చేయడానికి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో అడ్మిన్ ఎస్పీ పి.సౌమ్యలత, విజయనగరం డీఎస్పీ ఎస్.లక్ష్మణమూర్తి, బొబ్బిలి డీఎస్పీ ఆర్.గోవిందరావు, చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు, ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ ఎం.వీరకుమార్, న్యాయసలహాదారులు వై.పరశురామ్, పలువురు సీఐలు, ఎస్సైలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ ఏఆర్ దామోదర్


