● ఉబర్, ఓలా, ర్యాపిడో అనుమతులు రద్దు చేయాలని డిమాండ్
● అక్టోబర్ 13న కలెక్టరేట్ వద్ద
మహాధర్నాకు పిలుపు
విజయనగరం గంటస్తంభం: ప్రభుత్వ విధానాలతో ఆటో, క్యాబ్ డ్రైవర్ల బతుకులు రోడ్డున పడుతున్నాయని, కార్పొరేట్ యాప్‌లకు వత్తాసు పలకడం మానుకోవాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి ఎ.జగన్మోహన్‌రావు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా శుక్రవారం స్థానిక కోట జంక్షన్ వద్ద డ్రైవర్లు ఆటోను తాడుతో లాగుతూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి బి.రమణ, ఉపాధ్యక్షుడు రెడ్డి శంకర్ రావులతో కలిసి ఆయన మాట్లాడుతూ, రవాణా రంగం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా డ్రైవర్లను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పెంచిన ఫీజులు, జరిమానాలు, చలానాల పేరుతో వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఉబర్, ఓలా, ర్యాపిడో సంస్థల అనుమతులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డ్రైవర్లకు రూ.20 వేల ఆర్ధిక సాయం అందించాలని, జీవో నంబర్ 21ని రద్దు చేయాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 13న కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ధర్నాలో కార్మికులంతా పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు బి.పాపారావు, బి.రామునాయుడు, గంగరాజు, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.


