కొత్తవలస: జాతీయ స్థాయి కరాటే పోటీల్లో కొత్తవలస మండలంలోని అర్ధానపాలెం గ్రామం సమీపంలో గల ఏపీ మోడల్ స్కూల్‌లో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న గనివాడ సాయిచైతన్య బంగారు పతకం సాధించినట్లు ప్రిన్సిపాల్ జి.ప్రసన్న శుక్రవారం తెలిపారు. మండలంలోని తుమ్మికాపల్లి గ్రామం సమీపంలో గల ఎన్‌ఎస్‌ఆర్ కల్యాణ మంటపంలో ఇటీవల జాతీయస్థాయి కరాటే బెల్ట్ పోటీలను నిర్వహించారు.ఈ పోటీలకు దేశంలో గల 14 రాష్ట్రాలకు చెందిన సుమారు 700 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో సాయిచైతన్య విశేష ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించినట్లు ఆమె తెలిపారు.ఈ సందర్భంగా సాయిచైతన్యను బోధనా సిబ్బంది శివప్రసాద్, పీడీ పి.మణి తదితరులు అభినందించారు.
ఆర్టీసీలో ఐటీఐ అప్రెంటిస్‌షిప్ దరఖాస్తుల స్వీకరణ
పార్వతీపురం రూరల్: ఏపీఎస్‌ఆర్టీసీలో ఐటీఐ అప్రెంటిస్‌షిప్ కోసం ఆన్‌న్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీ గౌతమ్ ఛటర్జీ తెలిపారు. జిల్లాలో డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, డ్రాఫ్ట్‌మెన్ సివిల్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయని వెల్లడించారు. అర్హులైన అభ్యర్థులు //డబ్ల్యూ డబ్ల్యూ డబల్యు.అప్రెంటిస్‌షిప్ ఇండియా.జివోవి.ఇన్// వెబ్‌సైట్ ద్వారా అక్టోబర్ 11 నుంచి 26వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, ఆ తర్వాత వచ్చే దరఖాస్తులు పరిగణనలోకి తీసుకోరని స్పష్టం చేశారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల అభ్యర్థులకు అక్టోబర్ 30న ఉదయం 10 గంటలకు విజయనగరం వీటీ అగ్రహారంలోని ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కళాశాలలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన జరుగుతుంది. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫారం, పదో తరగతి, ఐటీఐ మార్కుల జాబితాలు, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు, ఆధార్, పాన్‌కార్డు, బయోడేటాతో పాటు అసలు సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్స్ కాపీలను వెంట తీసుకురావాలి. సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో అభ్యర్థులు రూ.118 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇదివరకే అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసిన వారు దరఖాస్తుకు అనర్హులు. ఇతర సందేహాలకు పని వేళల్లో ఫోన్ 08922–294906 నంబరును సంప్రదించవచ్చని సూచించారు.
రన్నింగ్ ట్రైన్‌లో మొబైల్స్ దొంగ అరెస్ట్
విజయనగరం టౌన్: రైల్వేస్టేషన్, ఫ్లాట్‌ఫామ్, రన్నింగ్ ట్రైన్స్‌లో ప్రయాణికుల వద్ద మొబైల్ ఫోన్‌లను దొంగతనం చేస్తున్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, రాయపూర్‌కి చెందిన శత్రుఘ్న అనే వ్యక్తిని ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ సిబ్బంది శుక్రవారం విజయనగరం రైల్వేస్టేషన్‌లో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి రూ. 20వేలు విలువ కలిగిన మొబైల్‌ను స్వాధీనం చేసుకుని, నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్ నిమిత్తం రైల్వేకోర్టుకు తరలించారు. కార్యక్రమంలో ఆర్‌పీఎఫ్ ఎస్సై గోవిందరావు, జీఆర్‌పీ హెచ్‌సీ రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.
పాము కాటుతో వ్యక్తి మృతి
తెర్లాం: మండలంలోని అప్పలంపేట గ్రామంలో పాముకాటుకు గురైన ఓ వ్యక్తి మృతి చెందాడు, ఈ సంఘటనకు సంబంధించి తెర్లాం ఎస్సై బి.సాగర్‌బాబు శుక్రవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సాకేటి నాగభూషణరావు(51) గురువారం సాయంత్రం పొలానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా గట్టుపై పాము కాటువేసింది. వెంటనే చికిత్స నిమిత్తం రాజాంలోని ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. మృతుడికి భార్య కల్యాణి, వివాహితుడైన కుమారుడు సాయి ఉన్నారు. భర్త మృతి చెందడంతో తనకు దిక్కెవరంటూ భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదుపై ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


