రాజాం: అనుకోని రోడ్డు ప్రమాదం హాయిగా సాగిపోతున్న జీవితంలో కష్టాలు తెచ్చిపెట్టింది. కూలిపనిచేస్తే కానీ డొక్కాడని ఇంటిలో కొండంత ఆపద తీసుకొచ్చింది. రోడ్డు ప్రమాదం రూపంలో విధివంచనకు బలైన ఆ కుటుంబం సాయం చేసే చేతుల కోసం ఎదురుచూస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
రాజాం మండలం పొగిరి గ్రామానికి చెందిన కొండేటి రాజేశ్వరి గత ఐదునెలలుగా ఆస్పత్రిలో మంచానికే పరిమితమైంది. అంతకుముందు భర్త అచ్చియ్యతో కలిసి కూలిపనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేది. అచ్చయ్య తన కులవృత్తి నాయిబ్రాహ్మణ పనిచేస్తూ, ఖాళీ సమయంలో కూలిపనికి వెళ్లేవాడు. వారికి ఇద్దరు మగపిల్లలు. భార్యాభర్తలు కష్టపడి ఇద్దరి పిల్లలను ప్రభుత్వబడిలో చదివించుకుంటూ హాయీగా జీవించేవారు.
రోడ్డు ప్రమాదంతో తారుమారు
ఐదునెలల క్రితం బంధువులతో కలిసి రాజేశ్వరి ఆటోలో పెళ్లికి వెళ్తుండగా, పాలకొండ సమీపంలో తుమరాడ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో బోల్తా పడడంతో ఆటోలోని ప్రయాణికులు గాయాలపాలయ్యారు. వారిలో రాజేశ్వరికి తీవ్రగాయాల య్యాయి. రెండు కాళ్లూ విరిగిపోయాయి. నడుమువరకూ మాంసం కొట్టుకుపోయింది. డబ్బులుపెట్టి ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లే స్థోమత లేక ఈ కుటుంబం శ్రీకాకుళంలోని రిమ్స్ ఆస్పత్రిలో వైద్యంకోసం చేరింది. అప్పటినుంచి రెండు పర్యాయాలు ఈమెకు వైద్యులు ఆపరేషన్ చేశారు. ఇప్పటికీ రెండు కాళ్లు తిరిగిరాలేదు. ఊడిపోయిన కండభాగం తిరిగి పునరుద్ధరణ అవలేదు. వైద్యం ఉచితంగా అందుతున్నప్పటికీ చిన్నచిన్న ఖర్చులు, ఆస్పత్రిలోనే భార్యతో పాటు భర్త ఉండిపోవడం, భోజన ఖర్చులు అధికమవడం, ఇంటి వద్ద కూలీనాలీ లేకపోవడంతో వారికి ఇప్పుడు అప్పులభారం పెరిగింది. ఐదునెలలుగా ఇంటిముఖం ఎలా ఉంటుందో భార్యాభర్తలకు తెలియదు. ఇప్పటికీ ఆస్పత్రిలోనే ఇద్దరు ఆలుమగలు ఉంటున్నారు. ఇతర ఖర్చుల నిమిత్తం వారికి రూ.1.50 లక్షలు మేర అప్పులు పెరిగిపోయాయి. ఇప్పుడు అప్పు ఇచ్చే దాతలేకుండా పోయాడు. అటు వైద్యం పూర్తికాలేదు. ఇంటికి వెళ్లొద్దు అంటూ వైద్యుల సూచన. చేసేది లేక మంచానికే పరిమితమైన భార్య రాజేశ్వరిని చూస్తూ భర్త అచ్చయ్య దీనంగా గడుపుతున్నాడు. ఈ కష్టాల సుడిగుండంనుంచి గట్టెక్కించే దాతల కోసం ఎదురుచూస్తున్నాడు. తన ఇద్దరు మగపిల్లలను అరసబ లగ వద్ద తమ బంధువుల ఇంటికి పంపించేశాడు.
దాతలు ముందుకు వచ్చి తనకు (ఫోన్‌నంబర్ 7680019084) ఆర్థిక సాయం చేయాలని,
తన భార్య ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుతున్నాడు.
రోడ్డు ప్రమాదంలో కాళ్లు పోగొట్టుకున్న మహిళ
ఐదునెలలుగా వైద్యం
ఇంటిముఖం చూడని కుటుంబం
అనాథలుగా పిల్లలు
కనీస ఖర్చులకు నగదులేక ఇబ్బందుల్లో బాధితులు


