● ఆపన్న హస్తాల కోసం ఎదురు చూస్తున్న పేద కుటుంబం
కురుపాం: ఆ చిన్ని గుండెకు పెద్ద కష్టం వచ్చింది. దాతల సహాయం కోసం ఓ నిరుపేద కుటుంబం ఆశగా ఎదురు చూస్తోంది. అభంశుభం తెలియని వయస్సులో గుండెకు సంబంధించిన రోగం రావడంతో ఏం చేయాలో తెలియక అవస్థలు పడుతున్న సమయంలో విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఉచితంగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి ప్రాణాలు నిలబెట్టారు. కానీ రోజువారి మందులకు, పలుమార్లు వైద్య తనిఖీలకు, ఇబ్బందులు పడుతున్నారు. సహాయం అందించే ఆపన్న హస్తం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. కురుపాం మండల కేంద్రంలోని శివ్వన్నపేట లో కొత్తపట్నం కౌశిక్ (10) తండ్రి రాము, తల్లి త్రివేణిలు నివాసం ఉంటున్నారు. తండ్రి సిమెంట్ పని కూలి చేస్తేనే పూట గడుస్తుంది. కౌశిక్ కు గత నెలలో గుండెకు శస్త్ర చికిత్సను విజయవాడలోని హెల్ప్ ఆస్పత్రి వారు ఉచితంగా చేసి సహాయం అందించారు. అయితే ప్రతి నెల విజయవాడ వెళ్లి తనిఖీ చేసుకోవాల్సి ఉంది. మందులు కొనుక్కో వడానికి ఆర్థికంగా బాగా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యల పరిష్కారానికి కలెక్టర్ నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో విన్నవించుకోగా ఇలాంటి కేసులకు ఆర్థికంగా సహాకారం అందించే పథకం ఏదీ లేదని మందుల కోసం సమీప మాదలింగి పీహెచ్‌సీకి వెళ్లాలని సూచించారు. అక్కడికి వెళ్తే ఈ మందులు ఇక్కడ దొరకవు పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి వెళ్లాలని సూచించారని ఇలా తిరగడమే మిగులుతుందని రోజు రోజుకు తమ కుమారుడి ఆరోగ్యం క్షీణిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తూ దాతలు కనికరించి ఆర్థిక సాయం అందజేయాలని నిరుపేద తల్లిదండ్రులు కోరుతున్నారు.


