చీపురుపల్లి: పట్టణంలోని దేవాంగులవీధిలో పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. ఏకకాలంలో ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులపై దాడి చేసి స్థానికులను ఆందోళనకు గురి చేసింది. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో దేవాంగులవీధిలో వాకిట్లో నిలబడిన పండిత సంతోష్ కుమార్, పండిత విష్ణుప్రియ, పండిత కళ్యాణి, పండిత గోవర్ధన్‌లను పిచ్చి కుక్క ఇష్టారాజ్యంగా కరిచి అక్కడి నుంచి పరారైంది. అకస్మాత్తుగా వీధిలోకి వచ్చిన పిచ్చి కుక్క స్థానికులను కరిచి వేస్తుండడంతో స్థానికులు గుర్తించి వెంబడించగా అక్కడి నుంచి సమీపంలోని రైల్వేస్టేషన్ వైపు పరుగులు తీసి పరారైంది. దీంతో కుక్క కాటుకు గురైన వారిని స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ వారికి టీకాలు వేశారు.


