రామతీర్థంలో వైభవంగా పవిత్రోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

రామతీర్థంలో వైభవంగా పవిత్రోత్సవాలు

Oct 7 2026 1:58 AM | Updated on Oct 7 2026 1:58 AM

నెల్లిమర్ల రూరల్‌: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో పవిత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. పవిత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం యాగశాలలో విశ్వేక్సేన ఆరాధన, స్వస్తి పుణ్యాహవచనం, ఆఘారం, అగ్ని ప్రతిష్టాపన, పవిత్ర శుద్ధి, తదితర కార్యక్రమాలను అర్చకలు శాస్త్రోక్తంగా జరిపించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 30 మంది రుత్వికుల ఆధ్వర్యంలో రామాయణం, సుందరకాండ, దివ్య ప్రబంధం, శ్రీరామ మూలమంత్ర జపంతో పాటు సుందరకాండ హవనం నిర్వహించారు. సాయంత్రం వేద రుత్విక్కుల ఆధ్వర్యంలో పంచశయనాది వాసం నిర్వహించారు. కార్యక్రమంలో ఈఓ వై శ్రీనివాసరావు, భక్తులు పాల్గొన్నారు.

మక్కువ ఏజెన్సీలో గజరాజులు

మక్కువ: మండలంలోని ఏజెన్సీ గ్రామాల్లో గజరాజుల గుంపు తిరుగుతుండడంతో ఏజెన్సీ వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. మండలంలోని ఎరస్రామంతవలస గ్రామ సమీపంలో ఆయిల్‌ తోటలు, వరి పొలాల పక్కన ఏనుగుల గుంపు సంచరిస్తోంది. కొద్ది రోజులుగా మండలంలో ఎనిమిది ఏనుగుల గుంపు తిరుగుతుండడంతో ఆయా గ్రామాల సమీపంలోనే పంట పొలాలకు వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారు. రైతులు సాగు చేస్తున్న వరి పంట పొలాల్లో ఏనుగులు తిరుగుతుండడంతో వరి పంటలు పాడైపోతున్నాయని రైతులు వాపోతున్నారు. ఏనుగులు తిరుగుతున్న ప్రదేశానికి ఎవరూ వెళ్లరాదని, ఎటువంటి కవిపు చర్యలు చేపట్టరాదని అటవీశాఖ అధికారులు దండోరా వేయిస్తున్నారు.

పురుగు మందు తాగిన యువతి మృతి

వీరఘట్టం: మండలంలోని గడగమ్మ గ్రామానికి చెందిన కందుల నవ్యశ్రీ(21) ఈనెల 1న పురుగు మందు తాగి ఆత్మహత్నాయత్నం చేయగా కుటుంబసభ్యులు గమనించి శ్రీకాకుళం రిమ్స్‌లో చేర్చగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు ఎస్సై ఎస్‌.షణ్ముఖరావు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. కందుల మధు, శ్రీదేవి దంపతుల చిన్న కుమార్తె నవ్యశ్రీ బీఫార్మశీ చదివింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ చిన్న ఉద్యోగం చేస్తోంది. అయితే తాను ఎం.ఫార్మసీ చదువుతానని ఇటీవల తల్లిదండ్రులకు చెప్పింది. ఎం.ఫార్మశీ చదివేందుకు రూ.లక్షలు ఖర్చు అవుతాయి. అంత ఖర్చు ఇప్పుడు చేయలేమని తల్లిదండ్రులు చెప్పడంతో మనస్తాపానికి గురైన నవ్యశ్రీ,ఈనెల 1న ఇంట్లో ఉన్న పురుగు మందు డబ్బాలో కొంత మందును తాగేసింది. వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement