21 రోజుల తర్వాత కష్టమే..! | - | Sakshi
Sakshi News home page

21 రోజుల తర్వాత కష్టమే..!

Oct 7 2026 1:58 AM | Updated on Oct 7 2026 1:58 AM

విజయనగరం అర్బన్‌: జననం..మరణం..ప్రతి కుటుంబానికి తప్పనిసరిగా ఎదురయ్యే ప్రక్రియ. కానీ ఇకపై ఈ వివరాలను సకాలంలో నమోదు చేయకపోతే సామాన్యులకు అదనపు ఇబ్బందులు తప్పేలా లేవు. జనన, మరణ ధ్రువీకరణ వత్రాల నమోదుకు 21 రోజుల గడువు విధించడంతో పాటు, ఆలస్యమయ్యే కొద్దీ నిబంధనలను కఠినతరం చేశారు. దీంతో నిర్లక్ష్యం చేసినా.. పరిస్థితుల కారణంగా ఆలస్యమైనా..తర్వాత ధ్రువీకరణ పత్రం కోసం అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీల్లో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ బర్‌త్స్‌ అండ్‌ డెత్స్‌ యాక్ట్‌–1969లోని సెక్షన్‌ 13కు చేసిన సవరణల ఆధారంగా ఆలస్య నమోదుకు కొత్త విధానం అమలు చేస్తున్నారు.

21 రోజుల్లోనే సులువు..ఆతర్వాతే అసలు చిక్కు

జననం లేదా మరణం జరిగిన 21 రోజుల్లోపు వివరాలు నమోదు చేస్తే ధ్రువీకరణ పత్రం జారీ ప్రక్రియ సులభంగా ఉంటుంది. కానీ ఆ గడువు దాటితే ఆలస్య నమోదుకు సంబంధించిన నిబంధనలు వర్తిస్తాయి. దీంతో సాధారణంగా రిజిస్ట్రార్‌ వద్ద పూర్తయ్యే ప్రక్రియ క్రమంగా ఉన్నతాధికారుల

అనుమతుల దిశగా వెళ్తుంది. ఏడాది దాటితే జిల్లా మెజిస్ట్రేట్‌ లేదా డివిజనల్‌ మెజిస్ట్రేట్‌ ఆదేశాలు అవసరం. రెండేళ్లు దాటితే ఫస్ట్‌ క్లాస్‌ జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ ఆదేశాలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే గడువు పెరిగే కొద్దీ దరఖాస్తుదారుపై ప్రక్రియాపరమైన భారం కూడా పెరగనుంది.

పత్రం కోసం..అధికారుల చుట్టూ తిరగాల్సిందేనా?

జనన ధ్రువీకరణ పత్రం లేకపోతే పిల్లల స్కూల్‌ అడ్మిషన్లు, విద్యా ధ్రువీకరణ పత్రాలు తదితర అవసరాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. మరణ ధ్రువీకరణ పత్రం లేకపోతే వారసత్వం, ఆస్తి, ప్రభుత్వ పథకాలు, ఇతర అధికారిక వ్యవహారాలు ముందుకు సాగడం కష్టమవుతుంది. ఇలాంటి కీలక పత్రాల విషయంలో కుటుంబాలు సకాలంలో నమోదు చేయకపోతే తర్వాత అదనపు ధ్రువీకరణలు, అధికారుల ఆదేశాలు, కార్యాలయల చుట్టూ తిరిగే పరిస్థితి రావచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది.

జిల్లా మారితే..ఇబ్బంది లేదంటున్న అధికారులు

ఒక జిల్లాకు చెందిన వ్యక్తి మరో జిల్లాలో మరణించినా కుటుంబ సభ్యులు తప్పనిసరిగా సొంత కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. పోస్టుమార్టం అనంతరం ఆస్పత్రి ఇచ్చే ధ్రువీకరణ పత్రాన్ని మీసేవా కేంద్రాల్లో సమర్పించి డెత్‌ సర్టిఫికెట్‌ పొందే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

జనన, మరణ నమోదుకు కఠిన నిబంధనలు

ఆలస్యమైతే అధికారుల చుట్టూ తిరగాల్సిందే

ఏడాది దాటితే మెజిస్ట్రేట్‌ ఆదేశాలు

రెండేళ్లు దాటితే కోర్టు చుట్టూ

ప్రదక్షిణలు

1వ తేదీ నుంచి అమలవుతున్న కొత్త నిబంధనలు

ఆలస్యం చేయకుండా వెంటనే నమోదు చేసుకోండి

కేంద్ర ప్రభుత్వ తాజా సవరణ చట్టం ప్రకారం జనన, మరణాల నమోదులో కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. ఏడాది లోపు అయితే తహసీల్దార్‌ స్థాయిలో పరిశీలన జరుగుతుంది. ఏడాది దాటి రెండేళ్ల లోపు ఆలస్యమైతే ఆర్డీవో స్థాయి అధికారులు విచారణ జరిపి ఉత్తర్వులు ఇస్తారు. ఇక రెండేళ్లు దాటిన పాత కేసుల నమోదుకు మాత్రం ఫస్ట్‌ క్లాస్‌ జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు ఆదేశాలు తప్పనిసరి. కోర్టుల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడకూడదంటే, ఇంట్లో ఎవరైనా జన్మించినా లేక మరణించినా అశ్రద్ధ చేయకుండా వెంటనే సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి.

– ఎస్‌.సుధాసాగర్‌, ఆర్డీవో, విజయనగరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement