● 12న హుకుంపేటకు చెట్టు తరలింపు
విజయనగరం క్రైమ్: ఉత్తరాంధ్ర కల్పవల్లి, విజయనగరం ఆడపడుచు పైడితల్లి అమ్మవారి జాతర ఉత్సవంలో సిరిమాను చెట్టును సోమవారం గుర్తించారు. ఆలయ పూజారి బంటుపల్లి వెంకటరావు కలలో అమ్మవారు కనిపించి చెప్పిన విధంగానే జొన్నవలస గ్రామంలో సిరిమాను,ఇరుసుమాను చెట్టును గుర్తించి వేద పండితుల సాక్షిగా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. గ్రామంలోని బూర్లి శ్రీనివాస్, రవిల కళ్లంలో గుర్తించిన చెట్టుకు పసుపు, కుంకుమ పెట్టి పూజలు చేశారు. ముందుగా ఈఓ శిరీష, ఆలయ పూజారి బంటుపల్లి వెంకటరావు, ధర్మకర్తల మండలి సభ్యులందరూ గుర్తించిన చెట్లకు జై పైడిమాంబ, జైజై పైడిమాంబ అంటూ పూజలు చేశారు దేవాలయ అర్చకులు సంకల్పంతో..శాస్త్రోక్తంగా పూజలు చేసిన తర్వాత స్థానిక కూటమి ఎమ్మెల్యే ఆదితి వచ్చి చెట్లకు పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదితి మాట్లాడుతూ గుర్తించిన చెట్లను ఈ నెల 12 వ తేదీన ఇక్కడ నుంచి హుకుంపేటకు తరలించనున్నట్లు తెలిపారు. పూజారి బంటుపల్లి నివాసం వద్దే సిరిమాను, ఇరుసు మానును చెక్కనున్నారన్నారు. ఇదే నెల 26,27 తేదీల్లో తొలేళ్లు, సిరిమాను ఉత్సవం జరుగుతాయన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ వర్మ, జనసేన నేత పాలవలస యశస్వి, ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు మాజీజెడ్పీటీసీ సభ్యులు రాజేష్, గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


