అర్హత లేని వ్యక్తకి నాలుగు కీలకపోస్టులు కట్టబెట్టడం, రాష్ట్ర కమిషన్ ఆదేశాలను సైతం లెక్క చేయకపోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ పాలనను ఎత్తిచూపుతోంది. చట్టాన్ని, ఉన్నతాధికారుల ఉత్తర్వులను రాజకీయ అండతో బేఖాతరు చేస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా విద్యాశాఖను గాడిలో పెడతారా.. కీలక బాధ్యతలన్నీ ‘రాజు’ చేతిలోనే ఉంచుతారా అన్నది వేచిచూడాల్సిందే.
● విద్యాశాఖలో చక్రం తిప్పుతున్న హెచ్‌ఎం
● నిబంధనలకు విరుద్ధంగా నాలుగు పోస్టులు
● ఆయన ‘అదనపు’ లీలలకు మంత్రి
అండదండలు..
● కమిషనర్ ఆదేశాలనూ
తొక్కిపెట్టిన జిల్లా విద్యాశాఖ
● దీనిపై కస్సుమంటున్న
ఉపాధ్యాయవర్గాలు
విజయనగరం అర్బన్:
ఆయన ఓ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పడం, పాఠశాల పరిపాలన చూసుకోవడం ఆయన ప్రాథమిక విధి. కానీ, విద్యాశాఖలో ఆయన పీఠం వేరు, ఆయన పవర్ వేరు.! విద్యాహక్కు చట్టాన్ని తుంగలో తొక్కి ఏకంగా నాలుగు కీలక పోస్టులను తన గుప్పిట్లో పెట్టుకుని రా‘రాజు’లా చక్రం తిప్పుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ జిల్లా మంత్రి అండదండలతో హెచ్‌ఎం సాగిస్తున్న ‘అదనపు’లీలలు విద్యా శాఖ వర్గాలను కలవరపెడుతున్నాయి.
● ఒక్కరికే నాలుగు కొలువులు!
ఓ పాఠశాల హెచ్‌ఎంకు జిల్లా స్థాయిలోనే అత్యంత కీలకమైన మరో మూడు అదనపు పోస్టుల బాధ్యతలను అప్పగించడం ఉపాధ్యాయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హెచ్‌ఎంగా, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్‌గా, జిల్లా పరీక్షల మండలి సెక్రటరీ (డీసీఈబీ సెక్రెటరీ)గా, విద్యాశాఖ అసిస్టెంట్ కమిషనర్ (ఏసీజీఈ)గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నిజానికి విద్యాహక్కు చట్టం (ఆర్‌టీఈ) ప్రకారం.. బోధన రంగంలో ఉన్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఇటువంటి పూర్తి స్థాయి పరిపాలనాపరమైన, జిల్లా స్థాయి అదనపు బాధ్యతలు చేపట్టడానికి వీల్లేదు. ఇదీ ముమ్మాటికీ చట్టవిరుద్ధం. కానీ ఆ హెచ్‌ఎం విషయంలో మాత్రం నిబంధనలన్నీ చుట్టాలుగా మారిపోయాయి. మంత్రి అండదండల ముందు రూల్స్ కాస్త రూమర్స్‌గా మారాయి.
హెచ్‌ఎంకు మరో మూడు అదనపు బాధ్యతలు అప్పగించడం చట్టవిరుద్ధమని కమిషనర్ విజయ రామరాజు పంపిన నోటీసు
హెచ్‌ఎంకు అక్రమంగా అప్పగించిన అదనపు బాధ్యతలపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అప్పటి విద్యాశాఖ రాష్ట్ర కమిషనర్ విజయరామరాజు స్పందించారు. బోధన రంగంలో ఉన్న వ్యక్తికి అదనపు బాధ్యతలు అప్పగించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేస్తూ, తక్షణమే ఆయనను ఆ బాధ్యతల నుంచి తప్పించాలని జిల్లా స్థాయి అధికారులకు షోకాజ్ నోటీసులు, ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రస్థాయి అత్యున్నత అధికారి ఆదేశాలు ఇస్తే... జిల్లా అధికారులు తలొగ్గి అమలు చేయాలి. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. కమిషనర్ రామరాజు ఇచ్చిన ఆదేశాలను జిల్లా విద్యాశాఖ అధికారులు బట్టుదాఖలు చేశారు. కమిషనర్ ఆర్డర్స్ కంటే ఆ‘వెనుక ఉన్న హస్తం’ పవరే ఎక్కువని జిల్లా యంత్రాంగం నిరూపించింది. ఆర్టీఈ చట్టం ప్రకారం టీచర్లు/ప్రధానోపాధ్యాయులు ఇలాంటి పోస్టుల్లో కొనసాగడానికి అర్హులు కారు. అందుకే తక్షణమే తప్పించాలని కమిషనర్ ఆదేశించినా... జిల్లా అధికారులు కదలకుండా కూర్చోవడం వెనుక పెద్ద కథే నడుస్తోందని విద్యాశాఖ వర్గాల గుసగుస. ఒక్కరికే అన్ని బాధ్యతలు అప్పగించడంతో విద్యాశాఖ పర్యవేక్షణ, ఓపెన్ స్కూల్ నిర్వహణ, పరీక్షల విభాగం పనులు అస్తవ్యస్తంగా మారుతున్నాయని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.


