చిక్కుల్లో పెదరావుపెళ్లి..! | - | Sakshi
Sakshi News home page

చిక్కుల్లో పెదరావుపెళ్లి..!

Jun 18 2026 12:23 AM | Updated on Jun 18 2026 12:23 AM

పొరపాటును సరిదిద్దాలి

మా పూర్వీకుల నుంచి భూములను సాగు చేసుకుంటున్నాం. రిజిస్ట్రేషన్‌ పత్రాలు ఉన్నాయి. 1902లో చేసిన సర్వేపై పూర్వీకులకు అవగాహన లేక, సర్వేకు సహకరించకపోవడంతో కొండపోరంబోకు భూములుగా నమోదు చేశారు. తీవ్ర అన్యాయంచేశారు. అప్పటి నుంచి ఇబ్బందులు తప్పడంలేదు.

– పెంట అప్పారావు,

విశ్రాంత ఉపాధ్యాయుడు, పెదరావుపల్లి గ్రామం

కొత్తవలస: శతాబ్దం కిందట జరిగిన పొరపాటు ఆ గ్రామ రైతుల పాలిట గ్రహపాటుగా మారింది. భూములు వారి ఆధీనంలోనే ఉన్నా రెవెన్యూ రికార్డుల్లో కొండపోరంబోకుగా నమోదుకావడంతో క్రయవిక్రయాలు జరగడంలేదు. భూమి ఉన్నా లెక్కల్లో లేకపోవడంతో రైతు కుటుంబాల్లోని యువతీయువకులకు పెళ్లితంటాలు తప్పడం లేదు. ఆడపిల్ల పెళ్లికి భూమి ఇస్తామన్నా వరుడి వైపు నుంచి వద్దన్న మాటే వినిపిస్తోంది. రెవెన్యూ చిక్కుముడి విప్పి మూడుముళ్లుపడేందుకు శుభంకార్డు వేయాలంటూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం దక్కడంలేదంటూ కొత్తవలస మండలంలోని పెదరావుపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

ఇదీ పరిస్థితి..

పెదరావుపల్లి గ్రామం విశాఖపట్నం–విజయగనరం జిల్లాలకు సరిహద్దులో ఉంది. గ్రామ పరిధిలోని 868.75 ఎకరాల భూమిని 1902 సంవత్సరంలో సర్వే చేశారు. ఈ గ్రామ రెవెన్యూ పరిధిలోని కొంత భాగాన్ని శృంగవరపుకోట తాలుకా నుంచి భీమునిపట్నం తాలూకాకు మార్చాలనే ఉద్దేశంతో అప్పటి అదికారులు సర్వే ప్రారంభించారు. గ్రామాన్ని శృంగవరపుకోట తాలూకాలోనే ఉంచాలంటూ గ్రామస్తులు పట్టుబట్టారు. సర్వేకు సహకరించ లేదు. దీంతో అధికారులు అప్పటివరకు సర్వే చేసిన 674.75 ఎకరాల భూమిని శృంగవరపుకోట తాలూకాలో చూపించి, మిగిలిన పెదరావుపల్లి గ్రామాన్ని, ఆ గ్రా మ రైతులు సాగుచేస్తున్న 194 ఎకరాల సాగు భూమిని భీమునిపట్నం తాలూకా పద్మనాభం మండలంలోని కొవ్వాడ గ్రామం సర్వే నంబర్‌–1లో కొండపోరంబోకు భూమిగా నమోదు చేసేశారు. అంతే.. అక్కడి నుంచి గ్రామస్తులకు తిప్పలు తప్పడం లేదు.

తప్పిదాన్ని గుర్తించినా..

సర్వే తప్పిదనాన్ని 1965లో జరిగిన రీ సర్వేలో అప్పటి భీమునిపట్నం సబ్‌కలెక్టర్‌ కె.పార్థసారథి గుర్తించారు. అప్పటి రైతులు నిరక్షరాస్యులు కావడంతో పొరపాటును గుర్తించలేకపోయారని, సెటిల్‌మెంట్‌ అధికారికి దరఖాస్తుచేసుకోలేదని ఆర్వోనంబర్‌ 1724/65 ఎ 2 ప్రకారం 1965 మార్చి 10వ తేదీన విశాఖపట్నం సెటిల్‌మెంట్‌ అధికారికి లేఖ రాశారు. సెటిల్‌ మెంట్‌ కోర్టులో రైతులకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్ఛినా న్యాయం జరగలేదు.

భూ సర్వేతో కదలిక..

గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ సమగ్ర సర్వేలో సమస్య పరిష్కారమవుతుందని గ్రామస్తులు భావించారు. అప్పటి ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, ఎంపీటీసీ కిలపర్తి అప్పలపరిదేశినాయుడు, పెంట అప్పారావు, పెంట జగ్గునాయుడు, బాదిరెడ్డి అప్పారావు తదితరులు సమస్యను అప్పటి కలెక్టర్‌ సూర్యకుమారికి వివరించారు. సమస్యను గుర్తించిన ఆమె 194 ఎకరాలను విజయనగరం జిల్లా కొత్తవలస మండలం పెదరావుపల్లి గ్రామంలో చేర్చి హక్కులు కల్పించాలని ప్రధాన భూ పరిపాలన కమిషనర్‌కు రేఖా నంబర్‌ 876/ 2022–ఎ1తో లేఖ రాశారు. సమస్య కొలిక్కివస్తుందన్న సమయంలో ప్రభుత్వం మారడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. గ్రామ అభివృద్ధి, సంక్షేమం, పాలన కొత్తవలస మండలం నుంచి సాగుతుండగా, జనాభాగణన విశాఖపట్నం జిల్లా పధ్మనాభం మండలం నుంచి అధికారులు నిర్వహించడంపై గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.

పెదరావుపల్లిలోని 194 ఎకరాలు

కొండపోరంబోకుగా నమోదు

క్రయవిక్రయానికి వీలుకాని వైనం

రైతు కుటుంబాల్లో పెళ్లిళ్లకు తంటాలు

రెండు జిల్లాల నడుమ నలిగిపోతున్న రైతులు

దశాబ్దాలుగా అందని రాయితీలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement