● ఎస్పీ ఏఆర్ దామోదర్
విజయనగరం క్రైమ్: క్రీడలు జీవితంలో ఆనందం కలిగించి, ఎప్పటికప్పుడు ఉత్సాహాన్ని నింపుతాయని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. ఈ మేరకు స్థానిక విజ్జి స్టేడియంలో హాస్పిటల్ మేనేజ్‌మెంట్ బుధవారం వైద్యులకు క్రికెట్ పోటీలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఆ పోటీలను ఎస్పీ దామోదర్ ప్రారంభించి మాట్లాడుతూ పోటీల్లో పాల్గొనడం వల్ల ఉద్యోగం, ఇతర దైనందిన జీవితంలో కలిగిన మానసిక ఒత్తిడిని దూరం చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల మానసిక ఒత్తిడి తొలగిపోయి, వృత్తిలో మరింత ఏకాగ్రత పెరగడంతో పాటు, వృత్తి నైపుణ్యం కూడా మెరుగవుతుందన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎస్పీ కూడా క్రికెట్ ఆడి క్రీడాభిమానులను అలరించారు.
పిడుగుపాటుతో దుక్కి
పశువుల మృతి
వేపాడ: మండలంలోని కరకవలస గ్రామపంచాయతీ శివారు మారిక గిరిజన గ్రామంలో పిడుగుపాటుకు గురై రెండు దుక్కి పశువులు మృతిచెందాయి. బుధవారం మధ్యాహ్నం ఈదురుగాలులు, వర్షంతో పాటు ఉరుములు, పిడుగులు పడ్డాయి. ఆ సమయంలో పడిన పిడుగుకు గ్రామానికి చెందిన పాతబోయిన పైడితల్లికి చెందిన రెండు పశువులు మృతి చెందాయి. వాటి విలువ సుమారు రూ.60 వేలు ఉంటుందని స్థానికులు తెలిపారు.
పిడుగుపాటుతో ఏడు ఆవులు..
శృంగవరపుకోట: మండలంలోని ధారపర్తి పంచాయతీ పరిఽధి పల్లపుదుంగాడ గ్రామంలో బుధవారం మద్యాహ్నం వర్షం కురుస్తున్న సమయంలో గిరిజన రైతులు జరత లచ్చన్న, కినబెరి రామన్న, పోరి అప్పన్న, జన్ని భీమన్నలకు చెందిన ఏడు ఆవులు పిడుగుపాటుకు చనిపోయాయి. దీంతో సుమారు మూడు లక్షల రూపాయల మేర ఆస్తినష్టం సంభవించిందని, గిరిజన రైతులు వాపోయారు. బాధిత గిరిజన రైతుల్ని ఆదుకోవాలని గిరిజన సంఘం నేతలు కోరారు.
లారీ ఢీకొని వ్యక్తి మృతి
విజయనగరం క్రైమ్: విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి బడుకొండపేటకు చెందిన సత్యం(65) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ మేరకు మృతుడి భార్య తవుడమ్మ ఫిర్యాదు చేసినట్లు ఎస్సై అశోక్ బుధవారం తెలిపారు. ఉదయాన్నే రోడ్డుపై వెళ్తున్న సత్యాన్ని లారీ ఢీ కొట్టడంతో పడిపోయాడని చికిత్స కోసం హాస్పిటల్ తరలించే లోగానే మృతిచెందాడని ఆయన భార్య ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.


