గుర్ల: మండలంలోని పలు గ్రామాల్లో రైతులు వినియోగిస్తున్న విద్యుత్ మోటార్లు, సోలార్ మోటార్లకు సంబంధించిన వైర్లు ఎప్పటికప్పుడు దొంగిలిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న వ్యక్తిని గుర్ల పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. మోటార్ వైర్లు దొంగిలిస్తున్న మండలంలోని పల్లిగండ్రేడుకు చెందిన గొల్లపల్లి గోవింద్‌ను పట్టుకుని అరెస్ట్ చేసినట్లు సీఐ జి.శంకరరావు, ఎస్సై పి.నారాయణ రావు బుధవారం తెలిపారు. కోటగండ్రేడు సమీపంలోని రైతులు మోటారు వైర్లు దొంగిలిస్తుండగా నిందితుడిని పట్టుకుని అరెస్ట్ చేశామన్నారు. నిందితుడు గోవింద్‌ను విచారణ చేయగా గతంలో చేసిన మోటార్ వైర్ల దొంగతనం గురించి చెప్పినట్లు తెలిపారు. అరెస్ట్ చేసిన వ్యక్తిని చీపురుపల్లి కోర్టులో హజరుపరచగా నిందితుడికి 14 రోజులు రిమాండ్ విధించినట్లు చెప్పారు.


