వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టులో చేపలవేట సాగించేందుకు జిల్లా మత్స్యశాఖ డీడీ లీజు ఆర్డర్ జారీ చేసినట్లు శ్రీ సీతారామ స్వదేశీ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు పెనుబోతు దుర్గారావు వెల్లడించారు. 1435వ ఫసలీ సొమ్ము రూ.18,21,817 చెల్లించి చేపల వేట సాగించాలని ఉత్తర్వులు జారీ చేయగా, ప్రస్తుతం రూ.9 లక్షలు ప్రభుత్వానికి చెల్లించినట్టు వెల్లడించారు.
తుపాకీ గురిపెట్టి రూ.50వేలు అపహరణ
● సరిహద్దులో ఓ వ్యాపారిపై ముసుగు
దొంగల దాడి
పార్వతీపురం రూరల్: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో సోమవారం ఓ వ్యాపారిపై తుపాకీ గురిపెట్టి డబ్బులు దోచుకున్న ఘటన కలకలం రేపింది. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమరాడ మండలం విక్రంపురం గ్రామానికి చెందిన చప్పటి పోలిరాజు పార్వతీపురం పట్టణంలోని దేవాంగుల వీధిలో ఉన్న ఓ కట్ పీస్ సెంటర్‌లో పనిచేస్తున్నాడు. దుకాణానికి సంబంధించిన వ్యాపార వసూళ్ల నిమిత్తం ఆయన ప్రతివారం వలే సోమవారం పొరుగు రాష్ట్రమైన ఒడిశా వెళ్లారు. అక్కడ వసూళ్లు ముగించుకుని తిరిగి వస్తుండగా సాయంత్రం 4:45 గంటలకు దేవపురం గ్రామాన్ని దాటి ఆంధ్రా చెక్‌పోస్ట్ సమీపానికి చేరుకునే సమయంలో ముగ్గురు ముసుగు దొంగలు ఆయనపై దాడిచేశారు. వ్యాపారిని కిందకు తోసేసి గొంతుపై కాలుపెట్టి తుపాకీని గురిపెట్టారు. ఆయన వద్ద ఉన్న రూ.50వేలను గుంజుకుని క్షణాల్లో పరారయ్యారు. దుండగులు జరిపిన దాడిలో బాధితుడి ఎడమ వైపు శరీర భాగానికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడి నుంచి వివరాలు సేకరించి, ప్రాథమిక దర్యాప్తును ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్‌లోనే అధిక ధరలు
● ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్
వంగర: పెట్రోల్, డీజిల్ ధరలు అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లోనే అధికమని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. కొండచాకరాపల్లిలో విలేకరులతో సోమవారం మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన నిరసన కార్యక్రమాలు విజయవంతమయ్యాయన్నారు. చంద్రబాబు సర్కారు హయాంలో పెట్రోలు, డీజిల్ ధరలు మంటపుట్టిస్తున్నాయని తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని మేనిఫెస్టోలో పెట్టి ఇప్పుడు భారీగా పెంచి ప్రజలను మోసం చేశారన్నారు. రాష్ట్రంలో విలువ ఆధారిత పన్ను(వ్యాట్) ఎక్కువగా ఉండడంతో దేశంలోని అన్ని రాష్ట్రాలుకంటే ఆంధ్రప్రదేశ్‌లో అధికంగా ఉన్నాయన్నారు. పెరిగిన ధరలతో వాహనదారులపై కోట్లాది రూపాయల భారం పడుతుందని తెలిపారు. తక్షణమే పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉత్తరావెల్లి సురేష్‌ముఖర్జీ, పార్టీ మండలాధ్యక్షుడు కరణం సుదర్శనరావు, కిమిడి చిట్టిబాబు, పారిశర్ల రామకృష్ణ, శ్రీనివాసరావు, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
పార్వతీపురం రూరల్: పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డా.ఎన్ ప్రభాకరరెడ్డి సోమవారం తన నివాసం నుంచి కలెక్టరేట్ వరకు సైకిల్‌పై ప్రయాణించా రు. కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు సైకిల్‌పై చేరుకున్నారు. జిల్లా ప్రజలు ఇంధన పొదుపు పాటించాలని పిలుపుని చ్చారు. అవసరం మేరకు వాహనాలు వినియోగించాలన్నారు.


