బొబ్బిలి: సబ్ డివిజనల్ పోలీసు కార్యాలయం బొబ్బిలి పరిధిలో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇరుకు రోడ్లున్న బొబ్బిలిలో ట్రాఫిక్‌తో పాటు శాంతి భద్రతల పర్యవేక్షణ వంటి అంశాల్లో పర్యవేక్షణకు ఉన్న కొద్దిపాటి సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. గతంలో పూర్తిస్థాయిలో ఉన్న పోలీస్ యంత్రాంగం దాదాపు సగానికి తగ్గినట్లనిపిస్తోంది. విచిత్రమేమిటంటే మండల కేంద్రాల్లో ఉండాల్సిన ఎస్సైల పోస్టులకు కూడా అధికారులను నియమించడం లేదు. పక్క స్టేషన్ల ఎస్సైలకు ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగిస్తున్నారు. సాధారణంగా ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించే యువత, ఇతర బాధ్యతారాహిత్య వ్యక్తుల వల్ల రోడ్డు ప్రమాదాలు, క్షణికావేశంలో పరస్పరం దాడులు సంభవించే పరిస్థితులు ఇప్పుడు సాధారణమైపోయాయి. ఇటువంటి సమయంలో పూర్తిస్థాయి సిబ్బంది ఉంటే పర్యవేక్షణ సులువవుతుంది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత శాంతి భద్రతల పర్యవేక్షణకు ఉండాల్సిన సిబ్బంది నియామకంపై దృష్టి సారించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆరు ఎస్సై పోస్టులు ఖాళీ
బొబ్బిలి సబ్ డివిజన్‌లో 9 పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి. ఈ స్టేషన్లలో సిబ్బంది కొరత ఉండడం సాధారణమే. కానీ ఏకంగా ఆరు ఎస్సై పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బొబ్బిలి ఎస్సై ఆర్ రమేష్ కుమార్ వీఆర్‌కు పంపించారు. అలాగే మరో ఎస్సై ఉండాలి కానీ నేటికీ నియామకం కాలేదు. ఇక వుమెన్ ఎస్సైగా రెండేళ్ల కిందట ఒకామె విధులు నిర్వహిస్తుండగా ఆమెను దిశ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేసి నేటికీ ఎవరినీ నియమించలేదు. ఇక్కడే ట్రాఫిక్ ఎస్సైగా విధులు నిర్వహించిన జ్ఙాన ప్రసాద్‌ను రామభద్రపురం బదిలీ చేశారు. అలాగే బాడంగి ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న తారకేశ్వర రావును సీసీఎస్‌కు బదిలీ చేశారు. తెలంగాణ జర్నలిస్టు కేవీఆర్‌ను అరెస్టుచేసే క్రమంలో జరిగిన రాజకీయ బదిలీగా దీనిని చెప్పుకుంటున్నారు. అలాగే మానాపురం ఎస్సై జయంతిని క్రైమ్ పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు. వారితో పాటు దత్తిరాజేరు మండలం బూర్జి వలస ఎస్సై రాజేష్‌ను కూడా సీసీఎస్‌కు పంపించారు. దీంతో సబ్ డివిజన్ మొత్తంలో ఉన్న 9 పోలీస్‌స్టేషన్లలో 6గురు ఎస్సైలు లేనట్లు లెక్క. శాంతిభద్రతల విషయంలో నిత్యం ఉండాల్సిన పోలీసుశాఖలో సిబ్బందిని ఎందుకనో నియమించడం లేదు. దీనిపై ప్రజా ప్రతినిధులు కూడా పట్టించుకోవడం లేదని ప్రజానీకం విమర్శిస్తోంది.
ఇలా వచ్చి అలా సెలవుపై వెళ్లిపోయి..
బొబ్బిలి ట్రాఫిక్ ఎస్సై జ్ఞానప్రసాద్‌ను రామభద్రపురం బదిలీ చేశారు. ఎందుకంటే అక్కడ అప్పటికే ఉన్న వెలమల ప్రసాదరావు స్థానిక నాయకులకు నచ్చలేదన్న కారణంతో కూటమి ప్రభుత్వం వీఆర్‌కు పంపించేలా చర్యలు తీసుకుందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో బొబ్బిలికి తీవ్రమైన ట్రాఫిక్ కారణంగా ఎల్.కోట ఎస్సైగా పనిచేసిన సీహెచ్ నవీన్ పడాల్‌ను ఇక్కడ ట్రాఫిక్ ఎస్సైగా నియమించారు. సరిగ్గా దాడితల్లి అమ్మవారి పండగ ముందు రోజు విధుల్లో చేరిన ఆయన పండగ ముగిసిన వెంటనే మరో చోట పోస్టింగ్ ప్రయత్నాలకోసం సెలవుపై వెళ్లిపోయారు. దీంతో ఇప్పుడు బొబ్బిలి సర్కిల్ కార్యాలయంలో ఇద్దరు ఎస్సైలు, ఒక వుమెన్, ఒక ట్రాఫిక్ ఎస్సై లేరు. ఏఎస్సైలు, కానిస్టేబుళ్లతోనే సీఐ నారాయణ రావు నెట్టుకొస్తున్నారు. మరో విషయం ఏంటంటే బొబ్బిలి సర్కిల్ కార్యాలయానికి 72 మంది సిబ్బంది (పేట్రన్ ) ఉండాలి. ఆ మేరకు పోస్టులు మంజూరై ఉన్నాయి. కానీ ఇప్పుడు అందులో సగం మంది కూడా లేరు. మొత్తంగా చూస్తే బొబ్బిలి డివిజన్‌కు 30 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. మే నెలలో అమ్మవార్ల పండగలున్నాయి. సోమవారం నుంచి మండలంలోని మెట్టవలసలలో పండగ ఉంది. మొన్న దాడితల్లి అమ్మవారి పండగ లాగానే ఇక్కడ కూడా ఇతర ప్రాంతాల నుంచి సిబ్బందిని తీసుకు రావాల్సి వస్తోంది.
బొబ్బిలి డివిజన్‌లో ఆరు ఎస్సై పోస్టులు ఖాళీ
విధుల్లో చేరిన వెంటనే సెలవులో ట్రాఫిక్ ఎస్సై
జాడే లేని వుమెన్ ఎస్సై
అదే కోవలో బాడంగి, బూర్జివలస, మానాపురం స్టేషన్‌లు
నియామకానికి ప్రాధాన్యమివ్వని కూటమి సర్కార్


