విజయనగరం ఫోర్ట్: జిల్లాలోని రైతులు వ్యవసాయంతో పాటు పాడి పోషణకు కూడా అధిక ప్రాధాన్యం ఇస్తారు. వ్యవసాయం కలిసి రాకపోయినా పాడిపశువుల ద్వారా పాల విక్రయంతో వచ్చే ఆదాయంతో జీవించవచ్చనేది రైతుల భావన. వ్యవసాయం చేసే ప్రతి రైతు రెండు, మూడు పాడిపశువులను మేపుతుంటాడు. అదేవిధంగా పౌల్ట్రీఫారాలు కూడా జిల్లాలో అధికంగానే ఉన్నాయి. గొర్రెలు, మేకల పెంపకం దారులు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఈ మూగ జీవాలకు ఏదైనా జబ్బు చేస్తే వైద్యసేవలు అందించే వారే కరువయ్యారు. జిల్లాలోని అనేక పశువైద్య శాలల్లో పశు వైద్యులు లేరు. దీంతో పశుసంవర్థకశాఖ సహాయకులే దిక్కుగా నిలుస్తున్నారు. దీని వల్ల పశువైద్యులు అందించాల్సిన సేవలు మూగజీవాలకు అందని పరిస్థితి. పశు వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నప్పటకీ టీడీపీ సర్కార్ భర్తీ చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లాలోని పశు వైద్యశాలలు
జిల్లాలో ప్రాంతీయ పశు వైద్య ఆస్పత్రులు 13 ఉన్నాయి. లైవ్‌స్టాఫ్ అధికారులున్న గ్రామీణ పశువైద్యశాలలు 40 ఉన్నాయి. జిల్లా ఆస్పత్రి ఒకటి ఉంది. వైద్యులున్న పశు వైద్యశాలలు 64 ఉన్నాయి. అదేవిధంగా సంచార పశు వైద్య శాలలు 13 ఉన్నాయి.
పశువుల వివరాలు
జిల్లాలో ఆవులు 3,77, 960 ఉన్నాయి. గేదెలు 97, 845 ఉన్నాయి. గొర్రెలు 4,48, 154, మేకలు 1, 56, 511, పందులు 2585, కోళ్లు 51, 26, 764 ఉన్నాయి.
150 రకాల మందులు అందుబాటులో ఉండాలి
ఖాళీగా 14 పశువైద్యుల పోస్టులు
జిల్లాలో 14 పశువైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా ఒక ఎ.డి పోస్టు, ఒక వెటర్నరీ లైవ్‌స్టాఫ్ అధికారి పోస్టు ఖాళీగా ఉన్నాయి. గంట్యాడ మండలం బోనంగి, మెరకముడిదాం, గర్భం, గరివిడి మండలంలోని జి.బొండపల్లి, ఎస్.కోట మండలం బొడ్డవర, దత్తిరాజేరు, దత్తిరాజేరు మండలం మానాపురం, వంగర, వంగర మండలం రాజుల గుమడ, చీపురుపల్లి, మెంటాడ, రామభద్రపురంలో మండలం కొట్టక్కి, రాజాం మండలంలో పొగిరి, సంకలిలో పశువైద్యుల కొరత ఉంది. అదేవిధంగా రాజం ఎ.డి (సహాయ సంచాలకుడు), గంట్యాడ మండలం పెదవేమలిలో వెటర్నీరీ లైవ్‌స్టాఫ్ అధికారి పోస్టు ఖాళీగా ఉన్నాయి.
అందని నాణ్యమైన పశువైద్యం
పశువైద్యుల కొరత వల్ల మూగజీవాలకు నాణ్యమైన వైద్యం అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామ పశు సంవర్థక శాఖ సహాయకులు వారి పరిజ్ఞానం మేరకు చికిత్స అందిస్తున్నారు.
పశు వైద్యశాలల్లో వైద్యుల కొరత
14 పశు వైద్యశాలల్లో వైద్యులు లేరు
రాజం ఎ.డి పోస్టు కూడా ఖాళీ
పశు సంవర్థక శాఖ సహాయకులే దిక్కు
జిల్లాలో పశు వైద్య శాలలు 118
జిల్లాలో 3,77,960 అవులు
గేదెలు 97,845
ఖాళీగా పశువైద్యాధికారి పోస్టులు
జిల్లాలో కొన్ని చోట్ల పశు వైద్యాధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రిక్రూట్ మెంట్ అయితే వైద్యులు వస్తారు.
డాక్టర్ ఎన్. దామోదర్‌రావు,
జిల్లా పశుసంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్


