విజయనగరం అర్బన్: పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో అధికమార్కులు తెచ్చుకున్న పలువురు విద్యార్ధులకు కలెక్టరేట్‌లోని సమావేశ మందింరంలో ఆదివారం ఘనంగా సత్కారం జరిగింది. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాల నుంచి ప్రతిభ కనపరిచిన 68 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.వెయ్యి వంతున నగదు ప్రోత్సాహకం, మెరిట్ సర్టిఫికెట్ అందజేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులను కూడా ప్రత్యేకంగా గౌరవించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విద్యార్థులను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులను అభినందించారు. ముఖ్య అతిథులుగా విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు విజయభాస్కర్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీలు డాక్టర్ గాదె శ్రీనివాసులునాయుడు, వేపాడ చిరంజీవిరావు, డీఈఓలు, విద్యావేత్తలు పాల్గొన్నారు.


