రామభద్రపురం:
రామభద్రపురం అంతర రాష్ట్ర మార్కెట్‌లో రాత్రి 2 గంటలైతే చాలు... జన సందడి ఆరంభమవుతుంది. వాహన రాకపోకలు, కూరగాయలు, పండ్లను తీసుకొచ్చే వాహనాల రాకపోకలు కనిపిస్తాయి. ఛాయ్‌వాలా నుంచి చిరువ్యాపారుల వరకు ఎవరి పనిలో వారు నిమగ్నమవుతారు. ఉదయం 10 గంటల వరకు వ్యాపారాలను చక్కబెడుతూ తమ జీవనమార్గాన్ని వెతుక్కుంటారు.
రైతులే మూలం..
మార్కెట్‌కు రైతులే మూలం. రైతులకు మార్కెట్టే ఆధారం. ఈ ప్రాంతంలో 25 సెంట్లు నుంచి 2 ఎకరాల భూమి ఉన్న ఆసామీ వరకు నిరంతరం శ్రమిస్తారు. భూమిని సారవంతంగా మలచి బంగారు పంటలు పండిస్తారు. ధరలు బాగుంటే ఆనందిస్తారు. ధరలు పడిపోయిన సమయంలో దిగులు చెందుతారు. వ్యవసాయం ఓ వ్యాపకంగా ముందుకు సాగుతారు. అందుకే... ఈ మార్కెట్‌లో 365 రోజులూ కూరగాయలు, సీజన్‌వారీ పండ్ల వ్యాపారం సాగుతుంది. వ్యాపారులు, కలాసీలు, వాహనదారులకు ఉపాధి లభిస్తోంది. ఇక్కడ కూరగాయల ధరలు కూడా ఇతర ప్రాంతాల కంటే తక్కువ ధరకే లభించడంతో ఉత్తరాంధ్రతో పాటు నాలుగు రాష్ట్రాల వ్యాపారులు మార్కెట్‌కు వచ్చి క్రయవిక్రయలు జరుపుతారు. తమ జీవనానికి మార్కెట్టే ఆధారమని చెబుతారు.
● రామభద్రపురం మార్కెట్ రామభద్రపురం, బాడంగి, దత్తిరాజేరు, గజపతినగరం, మెంటాడ, సాలూరు, బొబ్బిలి మండలాల రైతులు సాగుచేసిన కూరగాయలు, పండ్ల విక్రయాలకు ఆధారం. రోజూ 3 వేల మంది వరకు రైతులు కూరగాయలు, పండ్లను ఇక్కడకు తెస్తుంటారు.
● ఈ మార్కెట్ నుంచి రోజూ ఒడిశా రాష్ట్రంలోని రాయగడ, సుంకి, పొట్టంగి, జగదల్‌పూర్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కర్నాటక, మహారాష్ట్రలకు కూరగాయలు తరలిస్తారు. ఉదయాన్నే కోసిన కాయగూరలను నేరుగా మార్కెట్‌లోకి రైతులు తేవడంతో కొనుగోలుకు వ్యాపారులు మొగ్గుచూపుతారు.
● శుభకార్యాలకు కూరగాయలు కొనుగోలు చేయాలంటే గుర్తొచ్చేది రామభద్రపురం మార్కెట్.
● ఈ మార్కెట్‌పై ఆధారపడి పరిసర గ్రామాలకు చెందిన చిరువ్యాపారులు, కార్మికులు వందల సంఖ్యలో జీవనం సాగిస్తుంటారు.
● ఈ మార్కెట్ వల్ల ఏటా సుమారు రూ.35 లక్షల నుంచి రూ.45 లక్షల వరకు గ్రామ పంచాయతీకి ఆదాయం సమకూరుతుంది.


