ఉద్యోగులపై ఆక్రోశమా..!
సాక్షి టాస్క్‌ఫోర్స్: పంచాయతీల్లో ఏ చిన్నపని చేపట్టినా తమ అనుమతి తీసుకోవాలి... చెప్పిందే చేయాలి.. లేదంటే చర్యలు తప్పవు.. ఖబడ్డార్.. అంటూ నెల్లిమర్ల నియోజకవర్గంలో కీలకనేత భర్త హెచ్చరికలు ఉద్యోగ వర్గాల్లో అలజడిరేపుతున్నాయి. ఇప్పటికే ఇక్కడి నేతల వేధింపులు తట్టుకోలేక గతంలో ఎంపీడీఓలు, తహసీల్దార్లు బదిలీపై వెళ్లిపోయారు. ఇప్పుడు సచివాలయ ఉద్యోగుల వంతు వచ్చింది. కీలకనేత సమక్షంలోనే ప్రైవేటు కార్యాలయంలో ఉద్యోగులపై ఆమె భర్త వేధింపులకు దిగడం, ఆమె కిమ్మనకపోవడం ఉద్యోగవర్గాలను కలవరపెడుతున్నాయి. స్థానిక నేతల పదవీకాలం ముగిసి రెండు వారాలు గడిచింది. ప్రత్యేక అధికారుల పాలన ఆరంభమైంది. కీలకనేత కనుసన్నల్లోనే నియోజకవర్గంలో అధికారుల నియామక ప్రక్రియ సైతం పూర్తయినట్టు సమాచారం. ఇది చాలదన్నట్టు... సచివాలయ ఉద్యోగులపై కీలకనేత భర్త వేధింపుల పర్వం మొదలెట్టారు. రికార్డులు పట్టుకుని తన ప్రైవేటు కార్యాలయానికి రావాలంటూ భోగాపురంలోని ఓ ఐదు సచివాలయాల సిబ్బందికి రెండు రోజుల కిందట హుకుం జారీచేశారు. కీలకనేతతో కలిసి విడివిడిగా సమావేశాలు నిర్వహించారు. పంచాయతీల్లో ఎటువంటి పనులు చేయాలన్నా, ఎటువంటి కార్యక్రమం జరగాలన్నా తమ అనుమతి తప్పనిసరి అని, అదే ‘ప్రసాదం’ంగా భావించాలంటూ ఆదేశాలిచ్చారట. గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాల ఏర్పాటుతో పాటు ఏ చిన్న కార్యక్రమం నిర్వహించినా ప్రత్యేకాధికారులతో పాటు సచివాలయ సిబ్బంది తమ అనుమతులు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. లేదంటే చర్యలు తప్పవంటూ బెదిరింపులకు దిగినట్టు సమాచారం. దీంతో సమావేశానికి హాజరైన భోగాపురం మండలంలోని ఎ.రాయివలస, నందిగాం, భోగాపురం–1, భోగాపురం–2, ముక్కాం సచివాలయాలు సిబ్బంది బిక్కమొహం వేశారు. ఏ అధికారంలేని వ్యక్తి పంచాయతీ రికార్డులు చూపించాలంటూ హుకుం జారీచేయడంపై విస్తుపోతున్నారు. భూ అక్రమాల్లో ‘మిరాకిల్’ బయటపడకుండా ఉండేందుకే ఇలా వ్యవహరిస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
నెల్లిమర్ల నియోజకవర్గంలో ఆది నుంచి టీడీపీ, జనసేన నేతల మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. కూటమిగా ఉంటూనే ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నారు. పెత్తనం కోసం ఇరుపార్టీల వారు పాకులాడుతూ.. పలుసార్లు అధికారుల సమక్షంలోనే బాహాబాహీకి దిగారు. దీనిపై ఎవరికి వారు తమ అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఇప్పుడు పంచాయతీ పాలకుల పదవీకాలం ముగియడం, ప్రత్యేకాధికారుల పాలన రావడంతో తమ ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేతలకు చెక్‌పెట్టేందుకు, వారు చెప్పే ఏ పనిచేయకూడదన్న ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో ఉండే సచివాలయ ఉద్యోగులకు కీలకనేత భర్త హెచ్చరికలు చేస్తున్నట్టు సమాచారం. అందుకే... తన ప్రైవేటు కార్యాలయంలో రికార్డులు చూపించాలని, అన్నీ పక్కాగా ఉండాలంటూ పరోక్షంగా బెదిరింపులకు దిగినట్టు తెలిసింది. ‘అత్తమీద కోసం దుత్తమీద చూపిన’ చందంగా కీలకనేత భర్త వేధింపులు ఉన్నాయంటూ ఉద్యోగులు నిట్టూర్చుతున్నారు. వేధింపులు భరించలేమంటూ కొందరు ఉద్యోగులు సెలవు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఆ ‘లోకం’లో పనిచేసే ఉద్యోగులకు వేధింపులే ‘ప్రసాదం’గా మారాయంటూ వాపోతున్నారు. ఇలాంటి పాలన మునుపెన్నడూ చూడలేదని, పాలనఎప్పుడు ముగుస్తుందా అని ఎదురుచూస్తున్నట్టు కొందరు ఉద్యోగులు బహిరంగంగా చెబుతుండడం గమనార్హం.
చెప్పిందే చేయండి.. లేదంటే ఖబడ్డార్..
సచివాలయ ఉద్యోగులకు కీలకనేత భర్త హుకుం
తన ప్రైవేటు కార్యాలయంలో
ఉద్యోగులతో ‘ప్రత్యేక’ సమావేశం
ఏ పనిచేయాలన్నా అనుమతి
తీసుకోవాల్సిందే అంటూ హెచ్చరికలు
లేదంటే ఉద్యోగాలు ఉండవంటూ
బెదిరింపులు
భీతిల్లుతున్న ఉద్యోగులు
టీడీపీ నేతలపై ఉన్న ఆక్రోశం
ఉద్యోగులపై చూపుతున్న వైనం


