గాలివాన బీభత్సం | - | Sakshi
Sakshi News home page

గాలివాన బీభత్సం

Apr 8 2026 7:02 AM | Updated on Apr 8 2026 7:02 AM

తెర్లాం పీహెచ్‌సీ వద్ద గాలుల ధాటికి కూలిన విద్యుత్‌ స్తంభాలు

తెర్లాం–బొబ్బిలి రోడ్డులో గౌతమీ హైస్కూల్‌ వద్ద రోడ్డుకు అడ్డంగా కూలిన విద్యుత్‌ స్తంభం, చెట్టు

తెర్లాం/వంగర/రేగిడి/దత్తిరాజేరు/రాజాం:

జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం కురిసిన గాలివాన బీభత్సం సృష్టించింది. విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. చెట్లు కూకటివేళ్లతో కూలిపోయాయి. హోర్డింగ్‌లు, ఇళ్లు, దుకాణాల పైకప్పులు ఎగిరిపోయాయి. మామిడి, జీడిమామిడి, అరటి, మొక్కజొన్న పంటలకు అపార నష్టం వాటిల్లింది. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కొన్నిచోట్ల రోడ్లకు అడ్డంగా చెట్లు, విద్యుత్‌ స్తంభాలు కూలిపోవడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. వరుసగా రెండురోజుల పాటు భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

● తెర్లాం మండలంలోని తెర్లాం–బొబ్బిలి రోడ్డులో పీహెచ్‌సీ వద్ద విద్యుత్‌ స్తంభాలు, చెట్లు విరిగిపోవడంతో రెండు గంటల పాటు వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రోడ్లపై రైతులు ఎండబెట్టిన మొక్కజొన్న గింజలు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. స్టేట్‌ బ్యాంక్‌ వద్ద రెండు కొబ్బరి చెట్లు, నిద్రగన్నేరు చెట్టు రోడ్డుపై ఉన్న అంబేడ్కర్‌ విగ్రహంపై పడిపోయాయి. స్టేట్‌ బ్యాంక్‌ ఆవరణలోని జెరాక్స్‌ దుకాణంపై చెట్టు పడిపోవడంతో మరమ్మతుకు గురయింది. స్థానికంగా ఉన్న హోటల్‌ పైకప్పు ధ్వంసమైంది. రూ.4లక్షల వరకు ఆస్తినష్టం సంభవించింది. వర్షం ఆగిన వెంటనే ఎస్‌ఐ సాగర్‌బాబు తెర్లాం పీహెచ్‌సీకి వెళ్లి రోడ్డుపై పడిపోయిన చెట్లను పక్కకు తొలగించే ఏర్పాట్లు చేశారు. వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు.

● రాజాం, వంగర, దత్తిరాజేరు మండలాల్లో మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో వడగళ్ల వాన కురిసింది. పొలాల్లో ఉన్న రైతులు ఇళ్లకు పరుగులు తీశారు. ఉరుములు, మెరుపులతో భయాందోళన చెందారు. మొక్కజొన్న గింజలను టార్పాలిన్లతో రక్షించే ప్రయత్నం చేశారు.

విరిగిపడిన విద్యుత్‌ స్తంభాలు

కూకటివేళ్లతో కూలిపోయిన చెట్లు

పడిపోయిన హోర్డింగ్‌లు, ఇళ్లు, దుకాణాల పైకప్పులు

తడిసిన మొక్కజొన్న గింజలు

మామిడి, అరటి, మొక్కజొన్న పంటలకు అపార నష్టం

రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

తెర్లాంతో పాటు జిల్లాలోని పలు చోట్ల సోమ, మంగళవారం కురిసిన ఈదురుగాలులతో కూడిన వర్షాలకు మొక్కజొన్న, అరటి, వరి, మామిడి పంటలు సాగుచేసిన రైతులకు నష్టం వాటిల్లింది. వ్యవసాయ అధికారులు వెంటనే పంట నష్టం అంచనాలు వేసి ప్రభుత్వానికి నివేదించాలి. రైతులను ఆదుకునే ప్రయత్నం చేయాలి. పిడిగుపడి విజయరాంపురంలో కాబోతుల రాము అనే రైతు ఎద్దు మృతి చెందింది. సంబంధిత రైతుకు పరిహారం అందజేయాలి. – శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement