బంగారం కోసం..
గొల్లలపాలెంలోని నాగాన చెరువులో వెలికితీసిన మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీస్, రెవెన్యూ, వైద్యాధికారులు, (ఇన్‌సెట్లో) గొర్లె చినప్పమ్మ(ఫైల్)
చీపురుపల్లి: కేవలం 26 గ్రాముల బంగారం కోసం వృద్ధురాలైన మేనత్తను సొంత మేనల్లుడు తన స్నేహితుడితో కలిసి హత్యచేసి, చెరువులో పాతిపెట్టిన ఘటన చీపురుపల్లి మండలం గొల్లలపాలెంలో కలకలం రేపింది. గ్రామస్తులను భయాందోళనకు గురిచేసింది. హత్యచేసిన వారే మృతురాలి కుమార్తెలకు ఫోన్‌చేసి మీ అమ్మ అన్నవరంలో కనిపించిందంటూ చెప్పడంతో.. ఆ ఫోన్‌కాల్, సమీపంలో వారు కొనుగోలు చేసిన మద్యం దుకాణంలో సీసీ ఫుటేజీలు నిందితులను పట్టించాయి. హత్య వివరాలను డీఎస్పీ ఎస్.రాఘవులు, సీఐ జి.శంకరరావు మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
ఫిబ్రవరి 23 నుంచి కనిపించని వృద్ధురాలు
చీపురుపల్లి మండలం గొల్లలపాలెం గ్రామానికి చెందిన గొర్లె చినప్పమ్మ(64)కు ఇద్దరు కుమార్తెలు ఉండగా వారికి చాలా కాలం కిందటే వివాహాలు జరిగాయి. వృద్ధురాలు ఒక్కరే గొల్లలపాలెంలో ఒంటిరిగా నివసిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 23 నుంచి ఆమె కనిపించడం లేదు. అప్పటి నుంచి ఆమె ఫోన్ కూడా స్విచ్‌ఆఫ్ కావడంతో ఫిబ్రవరి 26న కుమార్తెలు గ్రామంలోని బంధువులకు ఫోన్‌చేసి వాకబు చేయగా కనిపించడం లేదని చెప్పారు. అల్లుడు రెడ్డి పాపినాయుడు మార్చి 7న చీపురుపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. వృద్ధురాలు మిస్సింగ్‌గా పోలీసులు కేసు నమోదుచేశారు. అయినప్పటికీ ఆమె ఆచూకీ తెలియకపోవడంతో వృద్ధురాలి మేనల్లుడు ఎజ్జిపురపు రమణ, స్నేహితుడు చందక రమణ హత్యచేశారన్న అనుమానంతో మార్చి 27న మరోసారి ఫిర్యాదు చేశారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపడంతో హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది.
నాగాన చెరువులో మృతదేహం వెలికితీత
నిందితులు ఇద్దరూ మృతురాలు చినప్పమ్మ ఇంటికి ఫిబ్రవరి 23న వెళ్లారు. ఆమె గొంతు నులిమి హత్యచేశారు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న 26 గ్రాముల బంగారం తీసుకుని చెరో సగం సర్దుకున్నారు. తరువాత మృతదేహాన్ని గొల్లలపాలెం సమీపంలోని నాగాన చెరువులో పూడ్చిపెట్టారు. డీఎస్పీ ఎస్.రాఘవులు, సీఐ జి.శంకరరావు నేతృత్వంలో ఫోరెన్సిక్, క్లూస్, రెవెన్యూ, వైద్య బృందాలు గొల్లలపాలెం నాగాన చెరువుకు చేరుకుని మృతదేహాన్ని వెలికితీశాయి. మృతదేహం చినప్పమ్మదేనంటూ ఆమె కుమార్తెలు ధ్రువీకరించారు. డీఎన్‌ఏ, స్కల్, బోన్ శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపించినట్లు డీఎస్పీ రాఘవులు తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.
నిందితులను
పట్టించిన
ఫోన్‌కాల్,
మద్యం
గొల్లలపాలెంలో వృద్ధురాలి హత్య
స్నేహితుడి సహకారంతో హత్యచేసిన మేనల్లుడు
గ్రామ సమీపంలోని నాగాన చెరువులో పూడ్చిపెట్టి..
అన్నవరంలో కనిపించిందంటూ
కుమార్తెలకు ఫోన్
నిందితులను పట్టించిన ఫోన్‌కాల్, మద్యం
వృద్ధురాలిని వెలికితీసిన పోలీసులు
వృద్ధురాలి ఆచూకీపై పోలీసులు లోతుగా విచారణ జరిపారు. నిందితులు వృద్ధురాలి కుమార్తెలకు చేసిన ఫోన్‌కాల్, కొనుగోలుచేసిన మద్యం బాటిళ్లు పట్టించాయి. నిందితులు ఎజ్జిపురపు రమణ, చందక రమణ శ్రీకాకుళం జిల్లాలోని పైడిభీమవరంలో ఓ హోటల్‌కు వెళ్లి కౌంటర్ వద్ద మద్యం బాటిళ్లు ఉంచారు. హోటల్ కౌంటర్‌లో ఉన్న వ్యక్తి ఫోన్ అడిగారు. ఆ ఫోన్ నుంచి ఎవరో గుర్తుతెలియని వ్యక్తులుగా మృతురాలి కుమార్తెలకు ఫోన్‌చేసి మీ అమ్మను అన్నవరంలో చూశామని చెప్పారు. దీనిపై పోలీసులు పైడిభీమవరంలోని హోటల్‌కు వెళ్లి విచారణ జరిపారు. నిందితులు వదిలివెళ్లిన మద్యం బాటిళ్లను గుర్తించారు. ఆ మద్యం బాటిళ్లు కొనుగోలు చేసిన మద్యం దుకాణానికి వెళ్లి సీసీ కెమేరాలు పరిశీలించి నిందితులను గుర్తించారు.


