విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ, సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్, నేతేటి ప్రశాంత్ శాస్త్రోక్తంగా పూజాధికాలు నిర్వహించారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలను సమర్పించి మొక్కుబడులు చెల్లించారు. ఆలయ ఈఓ కె.శిరీష కార్యక్రమాలను పర్యవేక్షించారు.
రాజధాని పేరుతో భూ దోపిడీ
● చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే కళావతి
● మావిగన్‌తో రాష్ట్ర అభివృద్ధి
భామిని: రాజధాని అమరావతి పేరుతో చంద్రబాబు ప్రభుత్వం భూ దోపిడీకి తెరతీసింది. రైతుల నుంచి అన్యాయంగా భూములు లాక్కొని వేల ఎకరాలను తమ డొల్ల కంపెనీ లు, బినామీలకు కట్టబెట్టింది. వాటికి విలువ రావాలనే ఉద్దేశంతో అమరావతిని గ్రాఫిక్స్ రూపంలో చూపుతూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తోందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి విమర్శించారు. ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకే డబ్బులు లేవని చెబుతున్న సీఎం చంద్రబాబు... రూ.2లక్షల కోట్లు వెచ్చించి రాజధానిని ఎప్పటికి అభివృద్ధి చేస్తారో చెప్పాలన్నారు. భామిని మండలం ఘనసరలో కార్యకర్తలతో మంగళవారం సమావేశమయ్యారు. ప్రస్తుతం రాజధాని భూముల్లో ఫాంహౌస్‌ల కేటాయింపుల్లో కూటమి నేతలు తలమునకలయ్యారని ఆరోపించారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి, ప్రజల దృష్టి మళ్లించేందుకు రాజధాని నాటకానికి తెరతీశారన్నారు. కేవలం రూ.20 వేల కోట్లతో అభివృద్ధి చెందే అవకాశం ఉందంటూ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ (మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు) మధ్య రాజధాని ఏర్పాటు ప్రతిపాదనకు రాష్ట్ర ప్రజలు మద్దతు తెలుపుతున్నారన్నారు. దీనిని చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారన్నారు. మొక్కజొన్నకు మద్దతు ధర లభించక రైతులు నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమన్నారు.


