పార్వతీపురం: జియ్యమ్మవలస మండలం ఆర్‌ఆర్‌బీ పురం జీటీడబ్ల్యూఏహెచ్‌ఎస్‌లో ఈనెల 19 నుంచి 21 వరకు నిర్వహించనున్న మన్యం లీగ్ – 2026 జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్‌కు సంబంధించిన వాల్‌పోస్టర్లను కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి సోమవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువతలో దాగి ఉన్న క్రీడలను వెలికితీసేందుకు ఈ టోర్న్‌మెంట్ ఎంతో దోహదపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో జేసీ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్, డీఎస్‌డీఓ కె. శ్రీధరరావు, తదితరులు పాల్గొన్నారు.
న్యాయం చేయండి..
విజయనగరం క్రైమ్: ఓ ఆకతాయి నుంచి తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని నిండు గర్భిణి వేడుకుంది. ఈ మేరకు సోమవారం స్థానిక పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. డెంకాడ మండలం చింతలవలస ఏపీఎస్పీ బెటాలియన్ దగ్గర్లో ఉన్న కృష్ణాపురంలో అనురాధ, కల్యాణ్ దంపతులు నివసిస్తున్నారు. వీరి ఇంటిలో ఉన్న మామిడిచెట్టు కాయలు ఎదురుగా ఉన్న పృథ్వి ఇంటి ఆవరణలో పడడంతో వాటిని తీసుకునేందుకు ఇటీవల అనురాధ వెళ్లింది. దీంతో నా అనుమతి లేకుండా ఇంటిలోకి ఎందుకువచ్చావంటూ అనురాధతో పృథ్వి గొడవపడ్డాడు. తర్వాత అనురాధ ఇంటి నుంచి ఆమె కుమార్తె, అత్త, మరిది ఇలా ఎవరు ఇంటి బయటకు వచ్చినా బూతులు తిట్టడంతో పాటు దుస్తులు విప్పి అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. దీంతో బాధిత కుటుంబం ఈ నెల 11న స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో సోమవారం స్థానిక పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసింది. ఆకతాయి నుంచి తమకు రక్షణ కల్పించాలని వేడుకుంది.
త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
● తెగిపడిన విద్యుత్ తీగలు
పార్వతీపురం రూరల్: పట్టణంలో సోమవారం సాయంత్రం త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకుని ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని తెలుగుతల్లి విగ్రహం వద్ద విద్యుత్ తీగలు ఒక్కసారిగా తెగిపడ్డాయి. రోడ్డుపక్కనే ఉన్న ద్విచక్ర వాహనాలు, ఓ కూరగాయల దుకాణంపై తీగలు పడ్డాయి. అయితే ఈ సమయంలో అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. వెంటనే స్థానికుల సమాచారంతో విద్యుత్ శాఖాధికారులు స్పందించి సరఫరాను నిలిపివేశారు. దీంతో వాహనదారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
చోరీ కేసులో ముగ్గురి అరెస్ట్
పార్వతీపురం రూరల్: మండల పరిధిలోని వైకేఎం కాలనీ, చర్చి వీధిలో జరిగిన వరుస దొంగతనాలకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 8వ తేదీ రాత్రి జరిగిన ఈ చోరీలపై బాధితురాలు మత్స తవిటమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు ఏఎస్పీ మనీషా రెడ్డి సారథ్యంలో రూరల్ సీఐ పి. రంగనాథం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన షేక్ అస్రాఫుల్, షేక్ బాబు, ఒడిశాకు చెందిన రూపేష్ నాగ్‌లను సోమవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 18 గ్రాముల బంగారు ఆభరణాలు, 200 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకుని, నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్సై ఎం. రాజేష్ తెలిపారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.


