● ఎస్పీ ఎస్‌వీ మాధవ్‌రెడ్డి
పార్వతీపురం రూరల్: అర్జీదారులు తెలియజేసిన సమస్యలను పరిష్కరించాలని ఎస్పీ ఎస్‌వీ మాధవ్‌రెడ్డి సిబ్బందిని ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఏడుగురు అర్జీదారులు తమ సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. ప్రధానంగా కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, భూ వివాదాలు, ఆన్‌లైన్ దగా, వేధింపులు, అధిక వడ్డీలకు సంబంధించిన ఫిర్యాదులు అందాయి.
అధికారులకు ఆదేశం..
బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న ఎస్పీ.. అక్కడికక్కడే సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ఫిర్యాదులపై క్షుణ్ణంగా విచారణ జరిపి, వాస్తవాల ఆధారంగా చట్టపరిధిలో తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఫిర్యాదులపై తీసుకున్న చర్యలపై నివేదికను జిల్లా కార్యాలయానికి పంపాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, డీసీఆర్‌బీ సీఐ ఆదాం, ఎస్సై రమేష్‌నాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.


