● బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయనకు
ఫోన్ చేసి ప్రశ్నించిన పీసీసీ చీఫ్ షర్మిల
బొబ్బిలి: ప్రజల ఆస్తులను కాపాడాల్సిన మీరే సమస్యగా మారితే ఎలా అని.. బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయనను పీసీసీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు. మండలంలోని పారాదిలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర – రచ్చబండ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సమయంలో బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట గ్రామానికి చెందిన ఏడుగురు పేదలు ఆమెను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. 1991లో ప్రభుత్వం తమకు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ భూములను పంపిణీ చేయగా..సాగు చేసుకుంటున్నట్లు బాధితులు పీసీసీ చీఫ్ దృష్టికి తీసుకువచ్చారు. అయితే ఇటీవల బేబినాయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ భూమిని రియల్టర్లకు అప్పగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ దగ్గర భూమికి సంబంధించి ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలు, బ్యాంకుల్లో చెల్లిస్తున్న క్రాప్‌లోన్లు, రైతుభరోసా వచ్చిన వివరాలు వైఎస్ షర్మిలకు చూపిస్తూ న్యాయం చేయాలని కోరారు. దీంతో ఆమె వెంటనే ఎమ్మెల్యే బేబి నాయనకు ఫోన్ చేయగా.. ఆ భూముల విషయం తర్వాత వివరిస్తానని బదులిచ్చారు. నాకు చెప్పవద్దు.. బాధితులకు వివరించాల్సిన బాధ్యత మీపై ఉంది కాబట్టి వెంటనే సమాధానం చెప్పాలని పీసీసీ చీఫ్ పట్టుబట్టగా, ఎమ్మెల్యే స్పందిస్తూ వారి ఆరోపణల్లో నిజం లేదు.. వారు చెప్పిన సర్వే నంబర్ వేరు.. ఈ సర్వే నంబర్ వేరు.. నేను ఇప్పుడు రాజాంలో ఉన్నాను. తర్వాత చెప్తాను అంటూ ఫోన్ కట్ చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, బాధితుల వినతి మేరకు ఆమె అధికారులకు ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు విద్యాసాగర్, ఇన్‌చార్జ్ మువ్వల శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.


