విజయనగరం: వైఎస్సార్‌సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావును ఆ పార్టీ నియోజకవర్గ పరిశీలకులుగా నూతనంగా నియామకమైనవారు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ధర్మపురిలోని సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్‌లో గజపతినగరం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ పరిశీలకులుగా నియమితులైన జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణి, అనకాపల్లి పార్లమెంటరీ జిల్లా పరిశీలకురాలు శోభా హైమావతి పూలమొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఇద్దరికీ మజ్జి శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి, బలోపేతానికి అందరం కలిసికట్టుగా కృషిచేయాలని ఆకాంక్షించారు.
బీజేపీకి నిమ్మక జయరాజు రాజీనామా
కురుపాం: బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు శాసన సభ మాజీ సభ్యుడు నిమ్మక జయరాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కుటుంబ పరిస్థితులు, వ్వక్తిగత కారణాల దృష్ణ్యా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోవడంతో సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు బీజేపీ ప్రధాన కార్యాలయానికి రాజీనామా లేఖను పంపించామన్నారు.
అప్పుల బాధ తట్టుకోలేక రైతు మృతి
గుర్ల: మండలంలోని జమ్ముపేటకు చెందిన రైతు కురుమునెల్లి దాలినాయుడు (33) పురుగులు మందు తాగి శుక్రవారం మృతి చెందాడు. వివరాల్లోకి వేళ్తే... దాలినాయుడు గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు . ఇటీవల కాలంలో పంటలకు పెట్టిన పెట్టుబడి రాకపోవడం, తెచ్చిన అప్పులు తీరకపోవడంతో మనోవేదనకు గురై గురువారం రాత్రి పురుగుల మందు తాగినట్లు స్థానికులు చెబుతున్నారు. గమనించి కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స జరుగుతుండగా శుక్రవారం మృతి చెందాడు. గుర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. మృతునికి భార్య నీలవేణి, కుమార్తెలు ఉష, ఝాన్సీ ఉన్నారు.
ఆ డీలర్ మాకొద్దు
రాజాం: మున్సిపాల్టీ పరిధి కొత్తవలస గ్రామంలో రేషన్ డిపో డీలర్‌పై చర్యలు తీసుకోవాలని, అక్రమాలకు పాల్పడుతున్న డీలర్‌ను తొలగించాలంటూ గ్రామానికి చెందిన 200 మంది రేషన్ లబ్ధిదారులు తహసీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా చేశారు. డీలర్ ఆగడాలను తహసీల్దార్ ఎం.రాజశేఖరానికి వివరించారు. రేషన్‌లో ప్రతినెలా కోతవేస్తున్నారని వాపోయారు. సరుకులు సక్రమంగా అందించడంలేదని ఫిర్యాదు చేశారు. లబ్ధిదారుల సమస్యను జిల్లా జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ చెప్పారు.


