విజయనగరం ఫోర్ట్:
చిరుధాన్యాలు, వాటితో తయారుచేసిన ఆహార పదార్థాలు ఆరోగ్యదాయకం. చిరుధాన్యాలు తీసుకోవాలని పదేపదే వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరుధాన్యాలకు మార్కెట్‌లో గిరాకీ పెరిగింది. కొందరు చిరుధాన్యాలను నేరుగా తీసుకోలేని వారు వాటితో తయారుచేసిన ఉప ఉత్పత్తులైన బిస్కెట్స్, లడ్డూలు, మిక్సర్, కారంపూస, మురుకులు తదితరవి ఆహారంగా తీసుకుంటున్నారు. వీటిని పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా ఆరగిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయనగరం గాజులరేగ వ్యవసాయ పరిఽశోధన స్థానంలో రూ.30 లక్షల వ్యయంతో చిరుధాన్యాల ఉపఉత్పత్తుల తయారీ యూనిట్‌ను ఏర్పాటుచేశారు. కొన్నాళ్లపాటు ఇక్కడ ఉపఉత్పత్తుల తయారీ జరిగేది. మార్కెట్‌కు తరలించేవారు. మహిళలకు ఉపాధి లభించేది. మరోవైపు చిరుధాన్యాలు సాగుచేసే రైతులకు యూనిట్ అండగా ఉండేది. రైతులు పండించిన పంటకు మద్దతు ధర లభించేది. సుమారు రెండేళ్లుగా ఇక్కడ ఉప ఉత్పత్తుల తయారీ నిలిచిపోవడంతో అటు మహిళలకు ఉపాధి పోవడంతోపాటు యూనిట్ నిరుపయోగంగా మారింది.
డిమాండ్ ఉన్నా...
చిరుధాన్యాల ఉప ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. చిరుధాన్యాలైన రాగి లడ్డు, రాగిమిక్సర్, రాగి బిస్కెట్స్, రాగి పిండి, రాగి చాక్లెట్స్, కొర్రలతో తయారుచేసిన కారంపూస, కొర్రలతో తయారు చేసిన మురుకులు, సామలతో తయారు చేసిన కేకు వంటి పలు రకాల చిరుధాన్యాల ఉప ఉత్పత్తులు మార్కెట్‌లో హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. వివిధ రకాల మార్ట్‌లలో చిరుధాన్యాల ఉప ఉత్పత్తుల విక్రయాలు అధికంగా జరుగుతున్నాయి. వ్యవసాయ పరిఽశోధన స్థానానికి రాగి బిస్కెట్స్, రాగి మిక్సర్, రాగి చాక్లెట్స్‌కు పేటెంట్ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే చిరుధాన్యాల ఉప ఉత్పత్తులతయారీ విభాగాన్ని లక్షల వ్యయంతో ఏర్పాటుచేశారు. చిరుధాన్యాల పౌడర్‌తో పాటు బిస్కెట్స్, మిక్చర్, కారంపూస తయారీకి అవసరమైన యంత్ర పరికరాలను కూడా అమర్చారు. ఇక్కడ తయారు చేసిన ఉత్పత్తుల అమ్మకానికి కలెక్టరేట్ ప్రాంగణంలోనూ, రైతు బజార్లు, ఆర్టీసీ కాంప్లెక్స్ వంటి ప్రాంతాల్లో అవుట్‌లెట్స్ ఏర్పాటు చేస్తామని అధికారులు ప్రకటించారు. ఇప్పుడు ఆ విషయాన్నే మరచిపోయారు. చిరుధాన్యాల ఉప ఉత్పత్తుల తయారీ కోసం నియమించిన శాస్త్రవేత్తను వేరే ప్రాంతానికి బదిలీ చేసేశారు.
ఉప ఉత్పత్తుల తయారీ నిలిచింది
చిరుధాన్యాల ఉప ఉత్పత్తుల తయారీ ప్రస్తుతం నిలిచింది. డీఆర్‌డీఏ అధికారులు చిరుధాన్యాల ఉప ఉత్పత్తుల తయారీకి శిక్షణకోసం మహిళలను పంపిస్తున్నారు. వారికి శిక్షణ మాత్రమే ఇస్తున్నాం.
– టి.ఎస్.ఎస్.కె.పాత్రో,
వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి
మూలకు చేరిన రూ.30లక్షల యూనిట్
నిలిచిన చిరుధాన్యాల ఉప ఉత్పత్తుల తయారీ
డిమాండ్ ఉన్నా పట్టించుకోని
యంత్రాంగం
మహిళల ఉపాధికి గండి
చిరుధాన్యాల సాగు రైతులకు ప్రోత్సాహం కరువు


