గంజాయి కేసులో
● ఒక్కొక్కరికి రూ.లక్ష జరిమాన
విజయనగరం క్రైమ్: గంట్యాడ పోలీసు స్టేషన్‌లో తొమ్మిదేళ్ల కిందట నమోదైన గంజాయి కేసులో అరెస్టయిన 9 మంది నిందితులపై నేరారోపణ రుజువుకావడంతో ఒక్కొక్కరికి 14 ఏళ్లు కారాగార శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ విజయనగరం ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి ఎం.మీనాదేవి గురువారం తీర్పు వెల్లడించారు. దీనికి సంబంధించి జిల్లా పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 2017 ఆగస్టు 23వ తేదీన గంజాయి తరిలిస్తున్నారన్న సమాచారం మేరకు గంట్యాడ పోలీసులు కొటారుబిల్లి కూడలి వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. బొడ్డవర నుంచి వస్తున్న మూడు వాహనాలను తనిఖీ చేశారు. అందులో సుమారు 641కిలోల గంజాయిని తరలిస్తున్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 10 మంది నిందితులను అదుపులోకి తీసుకుని, అప్పటి గంట్యాడ ఎస్‌ఐ పి.నారాయణరావు కేసు నమోదుచేశారు. అప్పటి విజయనగరం రూరల్ సీఐ డి.లక్ష్మణరావు కేసు దర్యాప్తు చేపట్టి కోర్టులో అభియోగపత్రం దాఖలుచేశారు. ఏఎస్‌ఆర్ జిల్లా అరకు మండలం లోతేరుకి చెందిన పట్టాసి చంద్రశేఖర్, అనంతగిరి మండలం శివలింగాపురానికి చెందిన శెట్టి ఉమామహేశ్వరరావు అలియాస్ హుస్సేన్, అరకు మండలం చోలెంకికి చెందిన కొర్న మోసెస్ అలియాస్ ఆలీ, డుంబ్రిగూడకు చెందిన మధ్యగురు సింహాద్రి, ఎస్.కోట మండలం టి.బొడ్డవరకు చెందిన శోభా నాగరాజు, డుంబ్రిగూడ మండలం పెదఅంజోడకి చెందిన పంగి సన్యాసిరావు, అనంతగిరి మండలం ఎగువబూడికి చెందిన జన్ని అప్పారావు, శివలింగాపురానికి చెందిన దుడ్డు వీరభద్రరాజు, విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం సత్యనారాయణపురానికి చెందిన మద్దుల శరత్‌పై నేరారోపణలు రుజువు కావడంతో జడ్జి మీనాదేవి శిక్ష విధిస్తూ తీర్పుచెప్పారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఏడాది జైలుశిక్ష అనుభవించాలని తీర్పులో వెల్లడించారు. మరో నిందితుడైన ఏఎస్‌ఆర్ జిల్లా అనంతగిరి మండలం తొకురుకి చెందిన గేదెల ధర్మతేజ కేసు విచారణ సమయంలో అనారోగ్యంతో మృతి చెందాడు. శెట్టి ఉమామహేశ్వరరావు అలియాస్ హుస్సేన్‌పై వివిధ జిల్లాల్లో 7 గంజాయి కేసులు ఉన్నాయి. ఇతనిపై ఏఎస్‌ఆర్ జిల్లా లో పి.డి.యాక్ట్ ఉంది. ఆయన గంజాయి వ్యాపారంతో సంపాదించిన సుమారు రూ.2.5 కోట్ల విలువైన ఆస్థిని జప్తుచేసినట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి. ఈ కేసులో ముద్దాయిలకు శిక్షపడేలా వ్యవహరించిన విజయనగరం రూరల్ సీఐ బి.లక్ష్మణరావు, గంట్యాడ ఎస్‌ఐ సాయికృష్ణ, ఇతర పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ అభినందించారు.


