రెడ్‌క్రాస్‌ సూపర్‌వైజర్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

రెడ్‌క్రాస్‌ సూపర్‌వైజర్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

Mar 11 2026 9:01 AM | Updated on Mar 11 2026 9:01 AM

విజయనగరం ఫోర్ట్‌: ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సోసైటీ బ్లడ్‌ బ్యాంక్‌లో టెక్నికల్‌ సూపర్‌వైజర్‌ పోస్టులకు అర్హత, అసక్తి గల అభ్యర్థులు నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు చైర్మన్‌ ప్రసాదరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ ఎంఎల్‌టీ, డీఎంఎల్‌టీ చదువుకొని, రెండేళ్లు పాటు బ్లడ్‌ బ్యాంక్‌లో పని చేసిన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. రూ. 20 వేలు నుంచి రూ. 22వేల వరకు జీతం ఉంటుందన్నారు. ఇతర వివరాలకు 9493092700, 7995435952 నంబర్లకు సంప్రదించాలని సూచించారు.

పేలుడు పదార్ధాలే లక్ష్యంగా ప్రత్యేక తనిఖీలు : ఎస్పీ

విజయనగరం క్రైమ్‌: పేలుడు పదార్ధాలు లక్ష్యంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని నాటు తుపాకులు, లైసెన్స్‌ లేకుండా వెపన్స్‌ కలిగిన వాటి కోసం కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించాలని ఎస్పీ దామోదర్‌ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. నాటు తుపాకుల ఏరివేత, పేలుడు పదార్ధాలు, గంజాయి, నాటు సారా నియంత్రణే లక్ష్యంగా ముందుగా గుర్తించిన గ్రామాల్లో కార్డన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించాలని ఆదేశించారు. నాటు తుపాకులు కలిగి ఉండడం, లైసెన్సు లేకుండా తుపాకులు వినియోగించడం చట్టరీత్యా నేరమన్న విషయాన్ని గ్రామస్తులకు అర్ధమయ్యే రీతిలో వివరించి, అవగాహన కల్పించాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో నాటు తుపాకులు వినియోగించే వ్యక్తుల సమాచారాన్ని సేకరించాలని ఆదేశించారు. గ్రామ సందర్శనలు చేసే సమయంలో నాటు తుపాకులు కలిగి ఉండడం ఇండియన్‌ ఆర్‌మ్స్‌ యాక్టు ప్రకారం తీవ్రమైన నేరం పరిగణించడం జరుగుతుందన్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో తెలపాలని పేర్కొన్నారు.

చిన్నారి హత్య కేసులో

నిందితుడికి యావజ్జీవం

పార్వతీపురం రూరల్‌: మూడేళ్ల చిన్నారిని దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడికి విజయనగరం మొదటి అదనపు జిల్లా కోర్టు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించింది. పార్వతీపురం మన్యం జిల్లా ఎల్విన్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 2021లో జరిగిన ఈ ఘటనపై మంగళవారం న్యాయమూర్తి ఎం.మీనాదేవి తీర్పు వెలువరించారు. గుమ్మలక్ష్మీపురం మండలం పెంగువ గ్రామానికి చెందిన కిల్లక వినోద్‌ (20), 2021 జూన్‌ 11న రాత్రి సమయంలో తన తల్లి పక్కన నిద్రిస్తున్న చిన్నారి గొంతు కోసి హత్య చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్‌ చేశారు. కోర్టులో పకడ్బందీగా సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టడంతో నేరం రుజువైంది. ఈ మేరకు నిందితుడికి యావజ్జీవ శిక్షతో పాటు రూ.11,000 జరిమానా విధిస్తూ న్యాయస్థానం ఆదేశించింది. జరిమానా చెల్లించకుంటే మరో ఏడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

ఒకరి పరిస్థితి విషమం

కొత్తవలస: మండలంలోని అరకు – విశాఖపట్నం జాతీయ రహదారిలో మంగళపాలెం జంక్షన్‌ రాజా సినిమా హాల్‌ వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు సోమవారం రాత్రి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎస్‌.కోటకు చెందిన జి.లీలాహర్షవర్దన్‌ తన బావమరిది కంచర్ల సాయితో కలిసి విశాఖపట్నం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో రాజా సినిమా హాల్‌ వద్ద ఎదురుగా వచ్చిన మరో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో లీలాహర్షవర్దన్‌, సాయి తీవ్రంగా గాయపడ్డారు. సాయి తలకు బలమైన గాయం కావడంతో పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల ఫిర్యాదు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ జోగారావు తెలిపారు.

గంజాయి నిందితుడి అరెస్టు

విజయనగరం క్రైమ్‌: గంజాయి కేసులో ఒడిశా రాష్ట్రానికి చెందిన దాస్‌ తాయాసబ్‌ అనే వ్యక్తిని అరెస్టు చేసి మెజిస్ట్రేట్‌ ముందు హాజరు పరిచినట్టు రూరల్‌ సీఐ లక్ష్మణరావు మంగళవారం తెలిపారు. నిందితుడు దాస్‌ మరొక ఐదుగురితో కలిసి ఒడిశా నుంచి విశాఖపట్నంకు కారులో గంజాయి తరలిస్తూ పోలీసులను చూసి గంజాయితో ఉన్న కారును విడిచిపెట్టి పరారయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసి ఎట్టకేలకు నిందితుడిని అరెస్టు చేశామని సీఐ తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేసి జైలుకు తరలించామని చెప్పారు. గంజాయికి సంబంధించి ఎటువంటి చర్యలు చేపట్టినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమాజంలో ఎక్కడ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement