బొబ్బిలి: ప్రతీ పోలింగ్ బూత్‌కు ఒక ఏజెంటు నియమించి వారి వివరాలను ఇవ్వాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను ఆర్‌డీఓ జేవీవీఎస్ రామమోహనరావు కోరారు. స్థానిక ఆర్‌డీఓ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం 264 పోలింగ్ బూత్‌లలో ఆయా వివరాలను రెండు రోజుల్లో ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం ఉన్న పోలింగ్ కేంద్రాల భవనాలు, పరిసరాలపై ఎవరికై నా అభ్యంతరాలుంటే స్థానిక తహసీల్దార్, ఆర్‌డీఓ కార్యాలయాలకు తెలియపర్చాలని సూచించారు. సమావేశంలో ఎన్నికల ఉప తహసీల్దార్ బలివాడ గౌరీశంకర్, వైఎస్సార్‌సీపీ మండల పార్టీ అధ్యక్షుడు తమ్మిరెడ్డి దామోదరరావు, టీడీపీ మండల అధ్యక్షుడు వాసిరెడ్డి సత్యనారాయణ, బీజేపీ అధ్యక్షుడు తాడ్డి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ ప్రత్యేకాధికారిగా రామమోహనరావు
బొబ్బిలి పురపాలక సంఘ పాలక వర్గం పదవీ కాలం గడువు తీరిపోవడంతో కొత్తగా ప్రత్యేకాధికారుల పాలనకు కూటమి ప్రభుత్వం తెరలేపింది. దీంతో మంగళవారం దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది. బొబ్బిలి మున్సిపల్ ప్రత్యేకాధికారిగా బొబ్బిలి ఆర్‌డీఓ జేవీఎస్‌ఎస్ రామోహనరావును నియమిస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ మంగళవారం ఉత్తర్వులు విడుదల చేశారు.


