● జిల్లాలో గ్లకోమా వారోత్సవాలు
పార్వతీపురం రూరల్: చాపకింద నీరులా విస్తరించి, కంటి చూపును కబళించే గ్లకోమా (నీటి కాసుల వ్యాధి) పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ డా. భాస్కరరావు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ గ్లకోమా వారోత్సవాల (మార్చి 8 నుంచి 14 వరకు) నేపథ్యంలో, మన్యం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి నేత్ర వైద్య విభాగం, జిల్లా అంధత్వ నివారణ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత వ్యాధి నిర్ధారణ శిబిరం నిర్వహించారు. శిబిరంలో రోగులకు ఉచితంగా దృష్టి దోష పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ, గ్లకోమా లక్షణాలను తొలి దశలోనే గుర్తిస్తే అంధత్వ నివారణ సాధ్యమని స్పష్టం చేశారు. నేత్ర వైద్య నిపుణులు డా. వెంకటేష్, అధికారులు శ్రీనివాసరావు, కృష్ణారావు రోగులకు పరీక్షలు నిర్వహించి తగిన సలహాలు అందించారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ అధికారి నగేష్‌రెడ్డి పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ప్రత్యేక శిబిరాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలకు మెరుగైన నేత్ర వైద్య సేవలు అందించి, చూపు కోల్పోకుండా తగిన జాగ్రత్తలు చేపడుతున్నామని జిల్లా అంధత్వ నివారణ అధికారి డా. సూర్యకౌశిక్ తెలిపారు.


