● కాంగ్రెస్ నాయకులు
పార్వతీపురం రూరల్: జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న పశువుల అక్రమ రవాణాను తక్షణమే అరికట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో జిల్లా రెవెన్యూ అధికారి కె. హేమలతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వంగల దాలినాయుడు, నాయకులు కోలా కిరణ్‌కుమార్, సిరిసిపల్లి సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పశువుల అక్రమ రవాణాపై గతంలో ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని అడ్డాపుశీల, పార్వతీపురం, పరశురాంపురం, గుమడ ప్రాంతాల నుంచి పొరుగు రాష్ట్రాలకు నిత్యం పశువుల తరలింపు జరుగుతోందన్నారు. జంతుహింస నివారణ చట్టం–1960 నిబంధనలను పాటించడం లేదని, వాహనాల్లో కనీస వసతులు కల్పించకుండా మూగజీవాలను తరలిస్తున్నారని ఆరోపించారు. పశువైద్య ధ్రువీకరణ పత్రాలు లేకుండా, రాత్రి వేళల్లో రహస్యంగా రవాణా సాగుతోందని వివరించారు. అధికారులు స్పందించి తనిఖీలు ముమ్మరం చేయాలని కోరారు.


