● జేసీ యశ్వంత్‌కుమార్ రెడ్డి
పార్వతీపురం: రెవెన్యూ క్లినిక్‌లో తెలియజేసిన సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కలెక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ ఫైళ్లను సకాలంలో పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో ఎస్‌డీసీ ఎస్. దిలీప్‌చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన ‘ఎజెంటిక్ ఏఐ’ వర్క్‌షాప్
విజయనగరం అర్బన్: పట్టణంలోని గాజులరేగ పరిధిలో గల సీతం ఇంజినీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఏపీఎంఎస్‌ఎంఈ, జేఎన్‌టీయూ జీవీ సంయుక్తంగా గత నెల 13వ తేదీ నుంచి నిర్వహిస్తున్న ‘ఏజెంటిక్ ఏఐ’ వర్క్‌షాపు సోమవారంతో ముగిసింది. ప్రపంచ బ్యాంక్ సహకారంతో అమలు చేస్తున్న ర్యాంప్ పథకం కింద ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆధునిక కృత్రిమ మేధస్సు నైపుణ్యాలపై అవగాహన కల్పించారు. 20 రోజుల పాటు జరిగిన ఈ శిక్షణలో కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ విభాగానికి చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం ముఖ్య అతిథులను నిర్వాహకులు సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీ రామ్మూర్తి, వివిధ శాఖల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
గిరిజాప్రసన్నకు ఉత్తమ మహిళా పురస్కారం
విజయనగరం: జిల్లా కేంద్రంలోని ది వైజాగ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇంగ్లిష్ టీచర్ సముద్రాల గిరిజాప్రసన్నను ఉత్తమ మహిళా పురస్కారం వరించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని, హైదరాబాద్‌లోని బిర్లా సైన్స్ సెంటర్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతులమీదుగా ఆమెకు పురస్కారం ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని మొత్తం 20 మంది మహిళలకు ఈ అరుదైన గౌరవం దక్కగా గడిచిన 23 ఏళ్లుగా ఉపాధ్యాయ రంగంలో అందిస్తున్న విశేష సేవలకు గాను తనకు ఈ గుర్తింపు లభించినట్లు గిరిజాప్రసన్న తెలిపారు.


