విజయనగరం టౌన్: ప్రత్యేక రాష్ట్ర సాధనకు అమరజీవి పొట్టిశ్రీరాములు చేసిన ప్రాణత్యాగం మరువలేనిదని నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి కొనియాడారు. మండల పరిధిలోని జొన్నగుడ్డి నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన పొట్టిశ్రీరాములు విగ్రహాన్ని ఆమె సోమవారం ఆవిష్కరించారు. అనంతరం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగు మాట్లాడే వారందరికీ ప్రత్యేక రాష్ట్రం కేటాయించి, ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణాలు విడిచిన గొప్ప పోరాటయోధుడు పొట్టిశ్రీరాములు అని, ఆయన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవ ప్రతీక అయిన అమరజీవిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సేవా సమితి ప్రొగ్రాం చైర్మన్ బండారు చంద్రశేఖర్ పాల్గొని, మాట్లాడుతూ జిల్లాలో పొట్టి శ్రీరాముల విగ్రహాలు 58 ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు చెరుకూరి నాగరాజు, ప్రధాన కార్యదర్శి బత్తుల కామేష్, విగ్రహ దాత గూడూరు నరసింగరావు తదితరులు పాల్గొన్నారు.


