విజయనగరం: జాతీయ స్థాయి మాస్టర్స్ బ్యాడ్మింటన్ పోటీలకు ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్‌లో రికార్డ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న పోలిపిల్లి పైడిరాజు అర్హత సాధించాడు. ఇటీవల విజయనగరం వేదికగా జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో 50 ప్లస్ వయస్సు విభాగంలో సింగిల్స్‌లో రన్నర్‌గా నిలవగా.. డబుల్స్‌లో ప్రథమ స్థానంలో నిలిచాడు. దీంతో పైడిరాజును ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు గోవాలో జరగనున్న జాతీయ స్థాయి మాస్టర్స్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక చేశారు. ఈ మేరకు పైడిరాజును విద్యుత్ శాఖ ఎస్‌ఈ మువ్వల లక్ష్మణరావు, స్పోర్ట్స్ కౌన్సిల్ అధ్యక్షుడు పెద్దింటి త్రినాథరావు, ప్రధాన కార్యదర్శి వి.మోహన్‌బాబు సోమవారం ప్రత్యేకంగా అభినందించారు. జాతీయ స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి విజయనగరం జిల్లా కీర్తిని చాటి చెప్పాలని ఆకాంక్షించారు.


