ఎన్డీపీఎస్ కేసుల్లో సమగ్ర దర్యాప్తు చేయాలి
పార్వతీపురం రూరల్: జిల్లాలో నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డి బుధవారం జూమ్ వీడియో కాన్ఫరెన్‌న్స్ ద్వారా మాసాంతపు నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో జరిగిన ఈ సమావేశంలో ఆయన ముఖ్యంగా పెండింగ్ కేసులపై, తుఫాన్ ప్రభావిత ప్రాంతాలపై కీలక ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఎన్డీపీఎస్ కేసుల్లో సమగ్ర దర్యాప్తు చేసి, నిందితులకు శిక్షలు పడేలా చూడాలని, గంజాయి వ్యాపారంతో ఆస్తులు కూడబెట్టినవారి ఆస్తులను అటాచ్ చేయాలని స్పష్టం చేశారు. పరారీలో ఉన్న నిందితులను అరెస్టు చేయాలని, నేరస్థులపై హిస్టరీ షీట్లు తెరవాలని ఆదేశించారు. కేసులకు సత్వర పరిష్కారం చూపే దిశగా గ్రేవ్, లాంగ్ పెండింగ్ కేసులు, మహిళా సంబంధిత నేరాల దర్యాప్తును వేగంగా పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్‌లు దాఖలు చేయాలని సూచించారు. ఎన్‌బీడబ్ల్యూలను త్వరగా అమలు చేయాలని, కేసుల వివరాలను ఎప్పటికప్పుడు సీసీటీఎన్‌ఎస్‌లో, ప్రమాద సమాచారాన్ని ఐఆర్‌ఎడిలో తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించి, డ్రంకెన్‌డ్రైవ్, ఈ–చలాన్లు అధికంగా నమోదు చేయాలని ఆదేశించారు. పేకాట, ఓపెన్ డ్రింకింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న ప్రాంతాల్లో ప్రతిరోజూ డ్రోన్ పోలీసింగ్ నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు. చివరగా, మోంథా తుఫాన్ ప్రభావంతో వరదలు వచ్చే ప్రాంతాలపై దృషి్‌ట్ సారించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు.
ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డి


