మందులోడా.. ఓరి మాయలోడా..!
● మందుల అమ్మకాల్లో మాయాజాలం
● ధరలు పెంచిన కంపెనీలు
● జీఎస్టీ తగ్గింపు పేరుతో పాతధరలకే
విక్రయాలు
విజయనగరం ఫోర్ట్: పక్కన ఫొటోలో కనిపిస్తున్న డెక్సారేంజ్ సిరప్ ఽఎంఆర్‌పీ రూ.192. కేంద్ర ప్రభుత్వం మందులపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతం తగ్గించింది. జీఎస్టీ తగ్గించిన ప్రకారం సిరప్‌ను ఎంఆర్‌పీపై 7 శాతం తగ్గించి విక్రయించాలి. దీంతో మందుల కంపెనీ ఎంఆర్‌పీని రూ.211కు పెంచేసింది. జీఎస్టీ తగ్గించినా ధర పెంచడం వల్ల గతంలో ఉన్న ధరే వచ్చేలా మందులు కంపెనీలు ప్లాన్ చేశాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే డెక్సరెంజ్ సిరప్ తయారీ కంపెనీయే కాదు. మందులు తయారీ చేసే అనేక కంపెనీలు ఈవిధంగా మందులు ధరలు పెంచేశాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం జీఎస్టీ తగ్గించినప్పటికీ వారి ఆదాయానికి ఎటువంటి ఢోకా ఉండకూడదనే ఉద్దేశంతో మందుల కంపెనీలు వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
వ్యాధిని తగ్గించడంలో మందులే కీలకం
మానవుడి జీవనశైలిలో మార్పులు రావడం వల్ల అనేక మంది జబ్బుల బారిన పడుతున్నారు. గంటల తరబడి టీవీలకు అతుక్కుపోవడం, వ్యాయమం లేకపోవడం, జంక్ ఫుడ్స్ అధికంగా తినడం తదితర కారణాల వల్ల అధికశాతం మంది బీపీ, సుగర్, గుండెజబ్బులు, కేన్సర్ తదితర వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా బీపీ, సుగర్ వంటి వ్యాధుల బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఏజబ్బు తగ్గాలన్నా మాత్రలు గాని, ఇంజక్షన్లు గానీ వాడాల్సిందే. జిల్లాలో వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న వారు లక్షల్లో ఉంటారు. వారంతా నెలకు లక్షల్లో మాత్రలు, సిరప్‌లు, ఇంజక్షన్లు వినియోగిస్తారు. మందుల వ్యాపారం నెలకు రూ.కోట్లలో జరుగుతుంది. జిల్లాలో ఉన్న 1200 మందుల షాపుల ద్వారా మందుల వ్యాపారం నెలకు రూ. 20 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు జరుగుతోంది.
నేరవేరని కేంద్రం లక్ష్యం..!
ప్రజలకు మందులను తక్కువ ధరకే అందించాలనే లక్ష్యంతో కేంద్రం జీఎస్టీని తగ్గించింది. 12 శాతం ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గించింది. దీని వల్ల మందుల ధరలు గణనీయంగా తగ్గుతాయని అందరూ భావించారు. కాని మందుల కంపెనీలు ధరలు పెంచడం వల్ల కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నేరవేరడం లేదనే ఆవేదన వ్యక్తమవుతోంది.
ధరల పెంపకంపై విచారణ
మందుల కంపెనీలు ధరలు పెంచడంపై విచారణ చేస్తాం. మందుల తయారీ తేదీలను వెరిఫై చేయిస్తాం.
రజిత, ఎ.డి, జిల్లా ఔషధ నియంత్రణశాఖ
మందులోడా.. ఓరి మాయలోడా..!
మందులోడా.. ఓరి మాయలోడా..!


