ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలి
విజయనగరం క్రైమ్: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులు, ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని, వారు ఏ కారణంతో వచ్చారో తెలుసుకుని, వారి ఫిర్యాదులు, చెప్పే విషయాలను శ్రద్ధగా వినాలని జిల్లాలోని పోలీస్ సిబ్బంది, అధికారులకు ఎస్పీ ఏఆర్ దామోదర్ సూచించారు. ఈ మేరకు జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్ల్‌లో రిసెప్షన్ కానిస్టేబుల్స్‌గా విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్స్, సంబంధిత పోలీసు అధికారులతో ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ బుధవారం జూమ్ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్‌కు వచ్చే బాధితులు, ఫిర్యాదుదారులతో వ్యవహరించాల్సిన తీరు గురించి దిశానిర్ధేశం చేశారు. మీటింగ్‌లో ఎస్పీ మాట్లాడుతూ సమస్యలను విన్నవించేందుకు వచ్చే ఫిర్యాదుదారులు, బాధితులను ముందుగా కూర్చోబెట్టి, వారికి మంచి నీరు అందించి, వారి ఫిర్యాదులను స్వీకరించాలన్నారు. ఫిర్యాదులను రాయలేని స్థితిలో ఉంటే వారి ఫిర్యాదును పోలీసులే రాసే విధంగా చొరవ తీసుకోవాలని స్పష్టం చేశారు. ఫిర్యాదుదారులను పదే పదే పోలీస్‌స్టేషన్‌కు తిప్పకుండా, వారి సమస్యలను పరిష్కరించే విధంగా చొరవ చూపాలని సూచించారు. ఫిర్యాదుదారులు ఇచ్చిన ఫిర్యాదు అంశాల తీవ్రతను అర్ధం చేసుకుని, వెంటనే స్పందించాలని, తదుపరి చర్యలు చేపట్టే విధంగా రిసెప్షన్ కానిస్టేబుల్స్ వ్యవహరించాలన్నారు. ఫిర్యాదు తీసుకున్న తరువాత ఫిర్యాదు అంశాలను రిసెప్షన్ రిజిస్టర్‌లో నమోదు చేసి, ఫిర్యాదుదారుకు రసీదు ఇవ్వాలన్నారు. అనంతరం, విషయాన్ని స్టేషన్ హౌస్ ఆఫీసరు దృష్టికి తీసుకువెళ్లి, చట్టపరమైన చర్యలు చేపట్టాలన్నారు.
బాధితులకు ఆశ్రయం కల్పించాలి
గొడవల కారణంగా బాధితులు ఎవరైనా తిరిగి ఇంటికి వెళ్లళ్ళలేని స్థితిలో ఉంటే వారిని శక్తి సాధన స్వధార హోమ్, వన్‌స్టాప్ సెంటర్‌లలో ఆశ్రయం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఫిర్యాదుదారు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన వెంటనే ఎఫ్‌ఐఆర్. కాపీని ఫిర్యాదుదారుడికి తప్పకుండా ఇవ్వాలని చెప్పారు. ఇక మహిళలకు రక్షణ పొందేందుకు నిర్దేశించిన ఫోన్ నంబర్లు, స్వధార్ హో, వన్‌స్టాప్ సెంటర్, న్యాయ సహాయం అందించే న్యాయవాదులు, ఎన్‌జీఓలు, సైక్రియాటిస్టులు, కౌన్సిలర్స్ వివరాలను ఉమెన్ హెల్ప్‌డెస్క్‌లో అందుబాటులో ఉంచాలన్నారు వారి సేవలు అవసరమైన బాధితులకు ఫోన్‌నంబర్లు ఇచ్చి, సహాయపడాలని అధికారులను, రిసెప్షన్ కానిస్టేబుల్స్‌ను ఎస్పీ ఎ.అర్.దామోదర్ ఆదేశించారు. కాన్ఫరెన్స్‌లో ఏఎస్పీ సౌమ్యలత, సిబ్బంది పాల్గొన్నారు.
పోలీస్ సిబ్బందికి ఎస్పీ ఆదేశాలు


