11,12 తేదీల్లో సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల క్రీడా పోటీల
● జిల్లా క్రీడాభివృద్ధి అధికారి
ఎస్.వెంకటేశ్వరరావు
విజయనగరం: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆదేశాల మేరకు ఈనెల 11,12 తేదీల్లో జిల్లా స్థాయి సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్.వెంకటేశ్వరరావు బుధవారం తెలిపారు. 11న నగరంలోని విజ్జి స్టేడియంలో అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, ఖోఖో, హాకీ, కబడ్డీ, వాలీబాల్ క్రీడాకారుల ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. అదేవిధంగా కంటోన్మెంట్‌లో గల ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రాంగణంలో స్విమ్మింగ్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. 12న రాజీవ్ స్టేడియంలో క్యారమ్స్, చెస్, క్రికెట్, పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్, యోగా, డ్యాన్స్/మ్యూజిక్ అంశాల్లో ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. విజ్జిస్టేడియంలో టెన్నిస్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రెండు రోజుల పాటు నిర్వహించే పోటీలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయని వెల్లడించారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారిని ఈనెల 19 నుంచి 22వ తేదీ వరకు రాష్ట్రస్థాయిలో జరిగే పోటీలకు ఎంపిక చేయనున్నామన్నారు. ఆసక్తి గల సివిల్ సర్వీస్ ఉద్యోగులు తమ డిపార్ట్‌మెంట్ గుర్తింపుకార్డుతో పోటీలకు హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఫోన్ 94917 67327 , 77996 20224 నంబర్లను సంప్రదించాలని కోరారు.


