రెవెన్యూశాఖపై కలెక్టర్ ఆగ్రహం
● రీ సర్వేలో తప్పులు, వివాదాలకు ఆస్కారం
● రెవెన్యూ అధికారుల సమావేశంలో
కలెక్టర్ రామ్‌సుందర్‌రెడ్డి
విజయనగరం అర్బన్: జిల్లా రెవెన్యూశాఖలో సేవలు అందించడంలో తీవ్ర జాప్యం, నిర్లక్ష్యం కొనసాగుతున్నాయని కలెక్టర్ ఎస్.రామ్‌సుందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాలు, ఓపీసీ సర్టిఫికెట్లు, ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్లు, మ్యుటేషన్ వంటి కీలక సేవలకు సంబంధించిన దరఖాస్తులు గడువు దాటి పెండింగ్‌లో ఉండడం పట్ల అసంతృప్తి వెలిబుచ్చారు. అధికారులు తమ ప్రాథమిక విధులను కూడా సక్రమంగా నిర్వహించడం లేదని, ఇది ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు కారణమవుతోందని హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జరిగిన రెవెన్యూ అధికారుల సమావేశంలో మీసేవ ఆన్‌లైన్ సర్వీసెస్, రీ సర్వే, ధాన్యం సేకరణ, రెవెన్యూ కలెక్షన్స్, హౌసింగ్, ప్రభుత్వ భూముల ఆసైన్‌మెంట్ వంటి అంశాల్లో అనేక లోపాలు వెలుగు చూశాయి. మండలస్థాయిలో పెండింగ్ దరఖాస్తులపై కలెక్టర్ ఆరా తీసినప్పుడు అధికారులు సరైన వివరణ ఇవ్వలేకపోయారు. ఈ నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే డివిజన్ స్థాయిలో సమీక్షలు జరిపి, పెండింగ్ దరఖాస్తులకు కారణాలను సవివరంగా నివేదికల రూపంలో సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.
గందరగోళంగా రీసర్వే
రీ సర్వే పనుల్లో తీవ్రలోపాలు ఉన్నాయని, తహసీల్దార్ల నిర్లక్ష్యం వల్ల వివాదాలకు దారితీసే పరిస్థితి ఉందని కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్‌డీఓలు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకపోవడంతో సర్వేలో తప్పిదాలు జరుగుతున్నాయ న్నారు. ఇది భవిష్యత్తులో పెద్ద ఎత్తున గొడవలకు కారణమవుతుందని హెచ్చరించారు.
ప్రైవేట్ దేవాలయాల్లో సీసీ కెమెరాలు లేవా?
ప్రైవేట్ దేవాలయాలకు రోజుకు వెయ్యి మంది భక్తులు వచ్చే చోట సీసీకెమెరాలు ఏర్పాటు చేయడంలో రెవెన్యూ, దేవాదాయ శాఖలు విఫలమయ్యాయని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో అధికారులు పర్యవేక్షణ లోపించిందని ఇది భక్తుల భద్రతకు ముప్పుకలిగిస్తుందని హెచ్చరించారు. సమావేశంలో జేసీ సేతుమాధవన్ మాట్లాడుతూ ధాన్యం సేకరణ ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని ఆర్‌డీఓలు, తహసీల్దార్లు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. జిల్లాస్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ మండలస్థాయిలో ఇంకా అమలు కావపోవడం ఆందోళనకరమన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ శ్రీనివాసమూర్తి, తహసీల్దార్లు, సర్వేయర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


