
గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం మొద్దు నిద్ర
కురుపాం: గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం సరికాదని మాజీ ఉప ముఖ్యమంత్రి పాము పుష్పశ్రీవాణి అన్నారు. మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని, ఏకలవ్య పాఠశాలను ఆమె ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సకాలంలో ప్రభుత్వ యంత్రాంగం, పాలకులు స్పందించకపోవడం వలనే తోయక కల్పన, అంజలి గురుకుల విద్యార్థినులు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే పాఠశాలలో 170 మంది విద్యార్థులు పచ్చకామెర్ల బారిన పడడం ఘోరమని పేర్కొన్నారు. గురుకుల పాఠశాలలో తాగునీటి కలుషితం కారణంగానే ఈ పరిస్థితి నెలకొందన్నారు. ఒకే తాగునీటి బోరు ద్వారా గురుకుల పాఠశాల, ఏకలవ్య పాఠశాలకు నీటి సరఫరా అవుతుందని అప్రమత్తంగా ఉండాలని తెలిపినా పట్టించుకోలేదన్నారు. ఒకటో తేదీనే ఏకలవ్య పాఠశాలకు చెందిన విద్యార్థులకు కామెర్లు సోకినట్టు గుర్తించినా ఆరో తేదీ వరకు కూడా విద్యార్థులకు స్క్రీనింగ్ చేయలేదన్నారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతుందన్నారు. ఇంతటి తీవ్రమైన సమస్య వెలుగులోకి తీసుకొచ్చినా స్పందించకపోవడం దారుణమన్నారు. స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి ఆదివారం వెళ్లగా జనరల్ ఫిజీషియన్ లేరని, ఆర్థోపెడిక్ వైద్యులు ఉన్నారని ఇప్పటికీ కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. హెపటైటిస్ ఏ ఎంతో ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారని అయినా పాలకులకు ఇంత నిర్లక్ష్యం ఏంటో అర్ధం కావడం లేదన్నారు. మలం కలిసిన నీటి కలుషితం కావడం వల్లే హెపటైటిస్ ఏ వ్యాప్తి చెందిందని నివేదికలు చెబుతున్నాయని, అయినా స్థానిక ఎమ్మెల్యే, మంత్రులు దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారులు పర్యవేక్షణ లోపంపై హ్యూమన్ రైట్స్‌కు, జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.
సరైన వైద్యం అందకే ఇద్దరు విద్యార్థినుల మృతి
ఒకే స్కూల్‌లో 170 మంది పచ్చకామెర్ల బారిన పడడం ఘోరం
హ్యూమన్ రైట్స్, జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం..
మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి