
పాటలే పోరాటాలకు స్ఫూర్తి
● రాష్ట్ర స్థాయి కళాజాత శిక్షణ ప్రారంభం
విజయనగరం అర్బన్: పాట.. మనిషి జీవనానికి గమనం.. పోరాటాలకు స్ఫూర్తి అని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.విశ్వనాథ్ అన్నారు. స్థానిక గురజాడ స్కూల్‌లో జనవిజ్ఞాన వేదిక రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి కళాజాత శిక్షణ తరగతులను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనం గురించి పనిచేసే సామాజిక సంస్థ జనవిజ్ఞాన వేదిక అని, చైతన్య రహితంగా నిరక్షరాస్యులుగా ఉన్న జనాన్ని చైతన్య పరచడానికే కార్యక్రమాలను రూపొందిస్తుందని తెలిపారు. జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఎంవీఆర్ కృష్ణాజీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎ.పృద్వీ, సాంస్కృతిక విభాగం రాష్ట్ర కన్వీనర్ గండ్రేటి శ్రీనివాసరావు, హరేరాం, గాంధీ, జానీ, గండ్రేటి లక్షణరావు, గండ్రేటి అప్పలనాయుడు, ఎ.వి.రాజశేఖర్, జిల్లా అధ్యక్షుడు ఆనంద్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ హెచ్‌కృష్ణారావు, జిల్లా కోశాధికారి ఎస్.శివాజీ, ఉత్తరాంధ్ర జనవిజ్ఞాన వేదిక కార్యకర్తలు పాల్గొన్నారు.