
15 నుంచి నిరవధిక సమ్మె
● విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లక్ష్మణ్
విజయనగరం ఫోర్ట్: విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ట్రాన్స్‌కో యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి అవలింభిస్తోందని, దీనికి నిరసనగా ఈనెల 15వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్టు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ సురగాల లక్ష్మణ్ తెలిపారు. విజయనగరం జేఏసీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 13వ తేదీన చలో విజయవాడ మహాధర్నాకు విజయవాడ, పార్వతీపురం మన్యం సర్కిల్ నుంచి వందలాది మంది సామూహిక సెలవులు పెట్టి బయలు దేరుతున్నట్టు వెల్లడించారు. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం స్పందించడంలేదని, గత్యంతరం లేని పరిస్థితుల్లో 14వ తేదీన వర్క్ టు రూల్, 15న సమ్మెకు సిద్ధమవుతున్నట్టు స్పష్టంచేశారు. సమావేశంలో విద్యుత్ జేఏసీ నాయకులు బంగారు రాజేష్‌కుమార్, పప్పల అప్పలస్వామినాయుడు, నిర్మలమూర్తి, ఆర్.అప్పలనాయుడు, సత్యనారాయణ, సీతారామరాజు, తదితరులు పాల్గొన్నారు.
మేకల కాపరి హత్య
● పంట పొలంలో మేకలు దిగాయని కాపరిపై కర్రతో దాడి
● ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కాపరి మృతి
కురుపాం: వరి పంట పొలంలోకి మేకలు దిగాయన్న కోపంతో ఓ వ్యక్తి మేకల కాపరి తలవెనుక భాగంపై కర్రతో కొట్టగా కాపరి మృతి చెందిన ఘటన కురుపాం మండల కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కురుపాం మండలం హుకుంపేట సమీపంలో రాయగడ నల్లన్నదొరకు చెందిన వరి పంట పొలం ఉంది. పంట పొలం గట్ల మీదకు మేదరవీధికి చెందిన పిల్లి రాములు(58) మేకలు ప్రవేశించాయి. వెంటనే మేకల కాపరి రాములు వాటిని బయటకు తరలించేలోపే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ కోపంలో చేతిలో ఉన్న కర్రతో రాయగడ నల్లన్నదొర కాపరి రాములు తల వెనుకభాగంలో గట్టిగా కొట్టాడు. దీంతో రాములు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు వెంటనే సైకిల్‌పై రాములును స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కురుపాం ఎస్సై నారాయణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రాములోరికి స్వర నీరాజనం
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో సింగర్ సాయి వేద వాగ్దేవి శనివారం సందడి చేసింది. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆశీర్వచన మండపంలో పలు భక్తి గీతాలను పాడి స్వామివారికి స్వర నీరాజనం సమర్పించింది. చిన్నారి పాడిన భక్తి గీతాలు భక్తులను ముగ్దులను చేశాయి. తన పాపకు గతంలో మాటలు వచ్చేవి కావని, రామతీర్థం సీతారామస్వామికి మూడుసార్లు మొక్కు చెల్లించుకున్న అనంతరం కొద్ది రోజుల్లోనే మాటలు వచ్చాయంటూ తల్లి సంతోషం వ్యక్తం చేశారు. స్వామివారి ఆశీస్సులతోనే సింగర్‌గా రాణిస్తోందని తెలిపారు.

15 నుంచి నిరవధిక సమ్మె

15 నుంచి నిరవధిక సమ్మె