
తెప్పోత్సవానికి సర్వం సిద్ధం
● సోమవారం ట్రయల్ రన్
● మంగళవారం సాయంత్రం పెద్దచెరువులో పైడితల్లి తెప్పోత్సవం
పైడితల్లి తెప్పోత్సవానికి సిద్ధం చేసిన హంసవాహనం
విజయనగరం టౌన్:
ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవానికి సర్వం సిద్ధం చేసినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి కె.శిరీష తెలిపారు. ఆలయ సిబ్బందితో కలిసి తెప్పోత్సవం ఏర్పాట్లను శనివారం పర్యవేక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెప్పోత్సవానికి తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పోలీస్, ఫిషరీస్, మున్సిపాలిటీ, ఫైర్ తదితర శాఖల సమన్వయంతో ఉత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించేలా చూస్తున్నట్టు వెల్లడించారు. సోమవారం ఉదయం ట్రయల్ రన్ నిర్వహిస్తామని తెలిపారు. 14న మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి రైల్వేస్టేషన్ వద్దనున్న వనంగుడిలో వేదపండితుల వేదమంత్రోచ్ఛారణలతో వేదస్వస్థ ఉంటుందని చెప్పారు. అనంతరం స్తపన మందిరంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు ఉంటాయని తెలిపారు. సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, వేదపండితుల సహకారంతో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పట్టుకుని ఆలయం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేసి ఆలయం బయట పుష్పాలంకరణలో సిద్ధం చేసిన రథంపై ఆశీనులు చేస్తారన్నారు. అక్కడ నుంచి భాజాభజంత్రీలతో సున్నంబట్టీవీధి మీదుగా పెద్దచెరువు వద్దకు తీసుకువచ్చి అమ్మవారిని హంసవాహనంపై ఊరేగింపు చేస్తామన్నారు. సాయంత్రం 5 గంటల నుంచి అమ్మవారు హంసవాహనంపై పెద్దచెరువులో మూడుసార్లు విహరిస్తారని తెలిపారు.
హంసవాహనంలో 20మందికే అవకాశం
అమ్మవారు విహరించే హంసవాహనంలో 20మందికే అవకాశం ఉంటుందని, మిగతావారి కోసం ప్రత్యేక బోట్లను ఏర్పాటుచేశామని ఇన్‌చార్జి ఈఓ కె.శిరీష తెలిపారు. 30 మంది వరకూ గజఈతగాళ్లు హంసవాహనం చుట్టూ తెప్పలపై ఉంటారన్నారు. ఫైర్ సిబ్బంది లైఫ్ జాకెట్లు, హస్కా లైట్లను ఏర్పాటుచేస్తారని తెలిపారు. భారీ ఎత్తున బాణాసంచా పేల్చేందుకు నిపుణులను ఏర్పాటుచేశామన్నారు. భక్తులందరూ తెప్పోత్సవంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.

తెప్పోత్సవానికి సర్వం సిద్ధం