
‘మత్తు’వదిలించేందుకు కదలిరండి
● గంజాయి, మద్యం అమ్మకాలపై ఐద్వా ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
విజయనగరం గంటస్తంభం: కూటమి ప్రభుత్వ మద్యం ‘మత్తు’పై పోరుబాటకు కదలిరావాలని ఐద్వా నాయకులకు పిలుపునిచ్చారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) 16వ రాష్ట్ర మహాసభలను పురస్కరించుకుని మద్యం, డ్రగ్స్, గంజాయి అమ్మకాలు నిషేధించాలంటూ ఎల్బీజీ నగర్, వినాయక నగర్‌లో శనివారం ర్యాలీ నిర్వహించారు. ఐద్వా జిల్లా కార్యదర్మి పి.రమణమ్మ మాట్లాడుతూ గంజాయి పీల్చి గల్లీలో పడిపోతే గృహశాంతి ఎగిరిపోతుందని, మద్యం తాగి భర్త చనిపోతే భార్య విధవ అవుతుందని... ప్రభుత్వం మాత్రం రెవెన్యూ రాగం వినిపిస్తోందంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. జిల్లాలో బెల్ట్‌షాపుల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయన్నారు. ఈ మత్తు మయమైన సమాజం నుంచి మహిళలను రక్షించాల్సిన సమయం వచ్చిందన్నారు. అనంతపురం వేదికగా సాగే మహాసభల్లో మద్యం, డ్రగ్స్, గంజాయి వ్యాపారానికి వ్యతిరేకంగా పోరాట కార్యాచరణకు రూపురేఖలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా కమిటీ సభ్యులు పుణ్యవతి, రామలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.